వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. ఏది జరిగినా విధి రాత అని సరిపెడుతుంటారు. ఇంటి ముందు గడప వద్ద కూచున్న వారిపై ఓ వాహనం దూసుకొచ్చి ప్రాణాలు తీస్తే… దాన్ని విధిరాతతో సరిపెడదామా? లేక వాహన డ్రైవర్ నిర్లక్ష్యమని అర్థం చేసుకుందామా? కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో ఇవాళ చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. తీవ్ర ఆవేదన కలిగించే ఘటన వివరాలిలా ఉన్నాయి.
చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగులో ఇంటి గడప ముందు దేవి (27), అమ్ములు (30), ఆమె భర్త కొండయ్య (45), లక్ష్మీదేవి (35) కూర్చొని వున్నారు. వీరంతా రోడ్డు పనులు చేస్తున్నారు. వీరంతా కొండ ఇంటి ముందు మంచంపై కూచొని మాట్లాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మృత్యువు బొలేరో వాహన రూపంలో వారిపైకి దూసుకెళ్లింది.
అతి వేగంగా వెళ్లిన బొలేరో వాహనం కింద పడి వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో కొండయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందారు. దేవి, అమ్ములును సమీపంలోని కడప రిమ్స్‌కు తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు.
ఇదిలా వుండగా అంత వరకూ రోడ్డు పనులు చేస్తూ, అందరితో కలుపుగోలుగా మాట్లాడుతున్న నలుగురు మృత్యువాత పడడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిపోయిందని మృతుల బంధువులు వాపోతున్నారు.