ఆ నాయకుడికి వృత్తి, ప్రవృత్తి వ్యాపారమే. వ్యాపార అభివృద్ధికి రాజకీయాలను పావుగా వాడుకుంటూ వుంటారు. కర్నూలు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాదిరిగా కడప జిల్లాలో ఆ వైసీపీ ఎమ్మెల్యే పంథా ఉంటుంది. గతంలో దివంగత వైఎస్సార్‌కు సన్నిహితంగా ఆయన ఉండేవారు. 2009లో కాంగ్రెస్ తరపున రాజంపేట నుంచి గెలుపొందిన మేడా మల్లికార్జున్‌రెడ్డి వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించారు. డబ్బు, రాజకీయం తోడు కావడం ఎమ్మెల్యేగా గెలుపొందడానికి సులభమైంది.
వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. నాటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో సన్నిహితంగా మెలిగి కాంట్రాక్ట్ వర్క్‌లు, బిల్లులు వేగంగా అయ్యేలా నడుచుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని భావించి, టీడీపీలోకి జంప్ అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కడప జిల్లాలో మాత్రం టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున్‌రెడ్డి గుర్తింపు పొందారు.
అనంతరం 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకుని ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఇటీవల జిల్లాల పునర్వ్యస్థీకరణలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటను కాదని, రాయచోటిని జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏపీ సర్కార్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో రైల్వేకోడూరు, రాజంపేట నియోజక వర్గాల్లో అధికార పార్టీ తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ విషయమై సీఎం జగన్ దృష్టికి రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, రాజంపేట, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వ నిర్ణయంలో మార్పు వస్తుందనే ఆశలను అధికార పార్టీ నేతలు వదులుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీకి ఎదురుగాలి వీస్తోందనే చర్చ నేపథ్యంలో మేడా మల్లికార్జునరెడ్డిలో అంతర్మథనం మొదలైందని సమాచారం.
ఒకవేళ రాజంపేటను కాదని, రాయచోటినే జిల్లా కేంద్రంగా కొనసాగిస్తే మాత్రం …తన దారి తాను చూసుకునే ఆలోచనలో మేడా ఉన్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో ప్రతి సీటు ఎంతో ముఖ్యమైందని వైసీపీ, టీడీపీ భావిస్తున్న తరుణంలో గెలుపు గుర్రాలను వదులుకుంటాయా? లేదా? అనేది అధినేతల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.
మేడాలో చోటు చేసుకున్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం కాచుకుని ఉన్నట్టు తెలిసింది. ఎన్నికలు సమీపించే తరుణంలో మేడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కడప జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.