తెలంగాణలో గవర్నర్ తమిళిసైకి- ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివాదం చెలరేగడం, క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇది మరింత ముదురుతుందా? సమసి పోతుందా చెప్పలేం. గవర్నర్ లకు – ముఖ్యమంత్రులకు వివాదాలు తలెత్తడం మన దేశంలో మామూలే. ఇగో ప్రాబ్లమ్స్ వల్ల, రాజకీయ కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ గవర్నర్ వ్యవస్థే అనవసరమని అన్నారు.
గవర్నర్ కేంద్రప్రభుత్వానికి ఏజెంట్లుగా పని చేస్తారనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి గవర్నర్ న్యూట్రల్ గా ఉండాలి. రాజకీయాలకు సంబంధం లేనివాడై ఉండాలి. అంటే ఏ పార్టీకి చెందకుండా ఉండాలి. ఇది థియరీ. కానీ ప్రాక్టికల్ గా వేరే విధంగా ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఆ పార్టీ (కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ) నాయకులనే గవర్నర్లుగా నియమిస్తుంటారు.
దీనివల్ల రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో సులభంగా తెలుసుకునే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఖాళీగా ఉన్న తమ పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడానికి గవర్నర్ వ్యవస్థ ఉపయోగపడుతోంది. ఇక అసలు విషయానికి వస్తే …. ఈసారి బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని పిలవకూడదని తెలంగాణా సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆయన బీజేపీ మీద, ప్రధాని మోడీ మీద చేసే పోరాటంలో ఇదీ ఒక భాగమే.
కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. గవర్నర్ తమిళిసై కూడా బీజేపీ నాయకురాలే. గవర్నర్ అయ్యాక ఆమెకు సాంకేతికంగా పార్టీతో సంబంధం ఉండదనుకోండి. అది వేరే విషయం. ఈ పదవిలోకి రాకముందు తమిళిసై తమిళనాడులో బీజేపీ నాయకురాలు. గవర్నర్ అయినప్పటికీ కేంద్రం ఆదేశాలను ఆమె పాటించక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, రాష్ట్రం విడిపోయాక తెలంగాణాకు, ఏపీకి కూడా తమిళనాడుకు చెందిన నరసింహన్ చాలా ఏళ్ళు గవర్నర్ గా ఉన్నారు.
ఆయన్ని నియమించింది యూపీఏ ప్రభుత్వమైనా బీజేపీ అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగారు. కేసీఆర్ కు ఆయనతో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే కేసీఆర్ -నరసింహన్ జిగ్రీ దోస్తులు. కానీ తమిళిసై గవర్నర్ గా వచ్చాక ఆ పరిస్థితి లేదు. తమిళిసై గవర్నర్ గా వచ్చాక కొంతకాలం బాగానే ఉన్నా కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి ఫిరాయించిన కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ ప్రతిపాదించడం, గవర్నర్ దానిపై మౌనంగా ఉండటంతో ఇద్దరి మధ్య దూరానికి బీజం పడింది.
గణతంత్ర దినోత్సవం రాజ్ భవన్ లో జరగాల్సి ఉండగా గవర్నర్, కేసీఆర్ విడివిడిగా జరుపుకున్నారు. రాజ్ భవన్ కు మంత్రులెవరూ వెళ్ళలేదు. ఇక కొన్ని రోజుల కిందట సమ్మక్క -సారలమ్మ జాతర ముగింపు రోజున తమిళిసై మేడారం వెళ్లారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు అక్కడ మంత్రులుగానీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ గానీ స్వాగతం పలకలేదు. ఇది ఒకరకంగా గవర్నర్ ను అవమానించినట్లే. అంతకు ముందే ముచ్చింతల్ కు వచ్చిన ప్రధాని మోడీకి కూడా కేసీఆర్ స్వాగతం పలకలేదు.
గవర్నర్ కు స్వాగతం పలకకపోవడం మోడీపై పోరాటంలో భాగమే అనుకోవాలి. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమావేశానికి గవర్నర్ ను ఆహ్వానించకపోవడం కూడా మెడీపై పోరాటంలో భాగమే. మోడీ ముచ్చింతల్ కు వచ్చినప్పుడు ఆహ్వానించకపోవడానికి అది ప్రైవేటు కార్యక్రమమని కారణం చెప్పారు. గవర్నర్ ను మేడారంలో ఆహ్వానించకపోవడానికి అదే కారణమై ఉంటుంది. బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించకపోవడానికి కూడా సాంకేతిక కారణం చెబుతోంది ప్రభుత్వం.
గత సమావేశాల తరువాత అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు కాబట్టి ఇప్పటి సమావేశాలు కొనసాగింపు మాత్రమేనని, అందుకే గవర్నర్ ను ఆహ్వానించనక్కరలేదని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి గవర్నర్ ప్రసంగం ఉండదు. ఆర్ధికమంత్రి హరీష్ రావు నేరుగా బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్ పత్రాలపై మొదట గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది. దానిపై ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. తాను సంతకం పెట్టానంటే ప్రభుత్వం ఏ సాంకేతిక కారణం చెబుతుంది?