మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు చెప్పుతో తనను తాను కొట్టుకుని వార్తలకెక్కారు. అంతేకాదు, ఒక అసమర్థుడిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు క్షమించాలని ఆయన ప్రజానీకాన్ని కోరడం గమనార్హం. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో చోటు చేసుకుంది. జిల్లాల పునర్వ్యస్థీకరణలో భాగంగా నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆ ప్రాంత వాసులు ఉద్యమిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ అఖిలపక్షం ఆధ్వర్యంలో నర్సాపురంలో ర్యాలీ, నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఆవేశానికి లోనయ్యారు. నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ 2019లో నర్సాపురం ఎమ్మెల్యేగా అసమర్థుడైన ముదునురి ప్రసాద్‌రాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నట్టు ప్రకటించడమే కాదు, అన్నంత పని చేశారు.
ప్రసాద్‌రాజుకు మద్దతుగా నిలిచి, ఆయన గెలుపులో పాలుపంచుకున్నందుకు నియోజకవర్గ ప్రజలు క్షమించాలని ఆయన వేడుకోవడం గమనార్హం. ఇదిలా వుండగా కొత్తపల్లి సుబ్బరాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడంతో అక్కడ కలకలం రేగింది. నిరసన సభలో పాల్గొన్న వాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా సాధించుకోవడంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ముదునురి ప్రసాద్‌రాజు విఫలమయ్యారనేది ఆ ప్రాంత వాసుల ఆవేదన, ఆక్రోశం. అదంతా కొత్తపల్లి సుబ్బరాయుడు తన చేతల్లో చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాల పునర్వ్యస్థీకరణ పుణ్యమా అని ఎమ్మెల్యే, సుబ్బరాయుడు మధ్య విభేదాలు బయటపడ్డాయి.