రాజకీయాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి స్వస్తి చెప్పనున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన వారసుడిని ఆయన రంగంలోకి దింపనున్నారు.
ఎమ్మెల్యే కావాలనే కోరిక నెరవేరిందని, రెండు దఫాలు కమలాపురం నుంచి ప్రాతినిథ్యం వహించానని, ఇక్కడి నుంచే తన కుమారుడు నరేన్ రామాంజులరెడ్డిని బరిలో దింపనున్నట్టు సన్నిహితుల వద్ద ఆయన చెబుతున్నారు.
కమలాపురం నియోజకవర్గంలోని సీకేదిన్నె (చింతకొమ్మదిన్నె) నుంచి నరేన్ రామాంజులరెడ్డి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కుమారుడిని నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు పరిచయం చేసేందుకు వెంట తీసుకెళుతున్నారు.
గతంలో సీకేదిన్నె నుంచే రవీంద్రనాథ్‌రెడ్డి జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే జెడ్పీ వైస్ చైర్మన్‌గా, కడప మేయర్‌గా కూడా ఆయన గుర్తింపు పొందారు. సీకేదిన్నె నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం మంచి సంకేతంగా భావించిన రవీంద్రనాథ్‌రెడ్డి… తన కుమారుడిని కూడా అక్కడి నుంచే రాజకీయ అడుగులు వేయించారు.
ఈ నేపథ్యంలో కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు రవీంద్రనాథ్‌రెడ్డి రెండేళ్లు ముందుగానే వ్యూహాలు రచిస్తున్నారు. అయితే నియోజకవర్గ సమస్యలేవీ పట్టించుకోరనే చెడ్డపేరు ఇటీవల రవీంద్రనాథ్‌రెడ్డిపై బాగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో నరేన్‌ను కమలాపురం నుంచి గెలిపించుకోవడం రవీంద్రనాథ్‌రెడ్డికి కత్తిమీద సామే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.