పేరుకి సాఫ్ట్ వేర్.. చేసేదంతా హార్డ్ కోర్

అదొక పెద్ద ఇంటర్నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. నొయిడాలో ఉన్న ఆ కంపెనీలో అతడో పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్. లక్షల్లో జీతం, చాలా పెద్ద హోదా. కానీ ఇదంతా పైపైకి మాత్రమే. లోపలకు…

అదొక పెద్ద ఇంటర్నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. నొయిడాలో ఉన్న ఆ కంపెనీలో అతడో పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్. లక్షల్లో జీతం, చాలా పెద్ద హోదా. కానీ ఇదంతా పైపైకి మాత్రమే. లోపలకు తొంగి చూస్తే మాత్రం అతడు చేసేవన్నీ చెత్త పనులు. మహిళల్ని బెదిరించడం, వాళ్ల నుంచి నగ్న చిత్రాలు తీసుకోవడం, వాటిని పోర్న్ సైట్స్ కు అమ్మడం. ఇది అతడి సైడ్ బిజినెస్. అతడి పేరు మోహిత్ శర్మ. ఈ మేకవన్నె పులిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంతకీ ఇతడి దందా ఏంటి?

మోహిత్ శర్మ ఇంజనీరింగ్ చేశాడు, ఆ తర్వాత ఎంబీఏ కూడా చదివాడు. పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కానీ సైడ్ బిజినెస్ కింద అమ్మాయిల్ని వేధించడం మొదలుపెట్టాడు. దీని కోసం అతడో ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ క్రియేట్ చేశాడు. అమ్మాయిలకు వలవేయడం, వాళ్ల బలహీనతల్ని క్యాష్ చేసుకొని నగ్నంగా దిగిన ఫొటోల్ని తీసుకోవడం మొదలుపెట్టాడు.

ఇతడి వేధింపులపై గడిచిన రెండేళ్లలో రెండు ఫిర్యాదులు కూడా అందాయి. తమకు బెదిరింది న్యూడ్ ఫొటోలు తీసుకుంటున్నాడంటూ ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన ఢిల్లీ సైబర్ పోలీసులు.. ఇనస్టాగ్రామ్ ఐడీ, దానికి అనుసంధానమై ఉన్న ఈ-మెయిల్ ఆధారంగా అడ్రస్ ట్రాక్ చేశారు.

నొయిడాలోని ఓ ఇంటి నుంచి ఇదంతా జరుగుతున్నట్టు పసిగట్టి ఇంటి తలుపు తట్టారు. మోహిత్ శర్మ తలుపుతీశాడు. పోలీసుల్ని చూసి బుకాయించే ప్రయత్నం చేశాడు. తన వైఫై హ్యాక్ అయిందని, దీనిపై ఫిర్యాదు కూడా చేశానని వాదించే ప్రయత్నం చేశాడు. అయితే మోహిత్ వ్యక్తిగత ల్యాప్ టాప్ ను ఓపెన్ చేసి చూసిన పోలీసులకు అసలు విషయం అర్థమైంది.

ల్యాప్ టాప్ నిండా అవే..!

మోహిత్ ల్యాప్ టాప్ ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 4వేల న్యూడ్ ఫొటోలు అందులో ఉన్నట్టు గుర్తించారు. వీటన్నింటినీ ఇతడు వేధించి, వల వేసి, డబ్బులొచ్చి సంపాదించినట్టు గుర్తించారు. 

అంతేకాదు, వీటిలో చాలా ఫొటోల్ని మోహిత్, ఇప్పటికే ఓ పోర్న్ సైట్ కు అమ్మేసినట్టు కూడా గుర్తించారు. ఆ డబ్బు కూడా అతడి ఎకౌంట్ లో పడిన విషయాన్ని నిర్థారించారు. దీంతో తప్పు ఒప్పుకున్నాడు ఈ కీచకుడు. డాటా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, 33 ఏళ్ల మోహిత్ ను అరెస్ట్ చేశారు.