సంక్షేమ పథకాల అమలుకు రోల్ మోడల్‌గా నిలిచిన ఏపీ ప్రభుత్వం ఆ తప్పు చేస్తుందా? అనే ప్రశ్న. ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తాజాగా రాసిన లేఖ పలు అనుమానాలకు తెరపైకి తెచ్చింది.
అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాలు, అందులో ఏయే పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రముఖ పథకాలతో సరిపోలుతున్నాయో శుక్రవారానికల్లా నివేదిక ఇవ్వాలనేది లేఖ సారాంశం. అలాగే ఇకపై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సొంతంగా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపకూడదని కూడా అందులో స్పష్టం చేయడంతో కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వదులుకోనుందనే ప్రచారం తెరపైకి వచ్చింది.
కేవలం తన వంతు వాటా నిధులు (మ్యాచింగ్ గ్రాంట్) చెల్లించే పరిస్థితిలేక కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వదులు కునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందనే ప్రచారం ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలో సంక్షేమ పథకాలకు కేంద్రం విడుదల చేసిన, చేస్తున్న నిధులను కూడా వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా పథకాలను బట్టి కేంద్రం తన వాటా కింద మెజార్టీ నిధులు అందజేస్తోంది.
కొన్ని పథకాలకు కేంద్రం తన వాటా కింద 75%, 90% కూడా నిధులను కేటాయిస్తోంది. ఇక మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అయితే కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకం ఘనతను తన ఖాతాలోకి వేసుకోవడం మొదటి నుంచి పరిపాటే. ప్రతి ఏడాది కేంద్రం తన వాటా కింద రాష్ట్రానికి సుమారు రూ.20 వేల కోట్లు అందిస్తోంది. రాష్ట్రం తన వాటా కింద రూ.12 వేలు జమ చేసి, సదరు పథకాలను తానే ఇస్తున్నట్టు రాష్ట్రాలు ప్రచారం చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో తన వాటా సొమ్మును కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించకుండా, ఇతరేతర వాటికి జగన్ సర్కార్ మళ్లిస్తోందని మోదీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో తన వాటా నిధులను ఇతరేతర పథకాలకు వాడుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
దీంతో కేంద్రం నుంచి వచ్చే గరిష్ట నిధులను వాడుకునే వీలు లేకపోవడం, మరోవైపు వాటికి తన వాటా కింద ఏడాదికి రూ.12 వేల కోట్లు చెల్లించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో వాటికి మంగళం పాడేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ప్రభుత్వ ఆర్థిక కష్టాల పుణ్యమా అని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రజలకు దక్కకపోవడం కాసింత ఆందోళన కలిగించే అంశమే. ఆ తప్పు వైసీపీ సర్కార్ చేస్తుందా? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.