సీబీఐ అంటే ఈ దేశంలో అత్యున్నతమైన నేర దర్యాప్తు సంస్థ! చాలా గొప్ప క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎవ్వరెవ్వరు తేల్చలేని క్లిష్టమైన కేసుల్ని కూడా.. సీబీఐ వారు టేకప్ చేస్తే ఒక కొలిక్కి తెచ్చేస్తారని కూడా అంటూ ఉంటారు.
సీబీఐ వారు దర్యాప్తులో, అనుమానితుల్ని సాక్షుల్ని విచారించే క్రమంలో వారి స్టయిలే చాలా ప్రత్యేకంగా ఉంటుందని కూడా అంటూ ఉంటారు. ఇదంతా బాగానే ఉందది. మరి సీబీఐ పరువు పోయే రీతిలో.. అనేకానేక పరిణామాలు జరుగుతూ ఉంటే ఆ సంస్థ ఏం చేస్తోంది? ఎందుకు మౌనం పాటిస్తోంది? తమ పరువు కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? కనీసం జరుగుతున్న పరిణామాల పట్ల సిగ్గుపడుతోందా? లేదా?
‘సీబీఐ విచారణలో/ వాంగ్మూలాల రూపంలో వెల్లడించిన వివరాలు’ అంటూ కొన్ని పత్రికలు ప్రతిరోజూ సీరియల్ గా కొన్ని కథనాలను ప్రచురిస్తున్నాయి. అవినాష్ రెడ్డిని హత్యకు సూత్రధారిగా నిరూపించే వాంగ్మూలాల మీదనే ఇన్నాళ్లూ వాళ్ల ఫోకస్ మొత్తం నడిచింది. ఇప్పుడు వివేకా కూతురు, అల్లుడు వాంగ్మూలాలు అంటూ.. సీఎం జగన్ ను నిందితుడు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక వీళ్ల మీద బురద చల్లడానికి వారికి పెద్దగా సమాచారం లేనట్లుంది. అవినాష్, జగన్ పేర్లు లేకపోయినా.. వాంగ్మూలాల్లోని అంశాలు అంటూ.. ఏదో ఒక సమాచారాన్ని వారు ప్రచురిస్తున్నారు. బెంగుళూరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేరుతో ప్రచురించిన వాంగ్మూలం అలాంటిదే!
తమాషా ఏంటంటే.. ఈ విచారణ/దర్యాప్తు సీబీఐ చేసినట్టుగా లేదు. పచ్చపత్రికలే దర్యాప్తు చేయించి.. తమ ఆఫీసు అల్మేరాల్లో ఉండే ఫైళ్లలోంచి రోజుకో పేజీ తీసి ప్రచురిస్తున్నట్టుగా.. యథేచ్ఛగా.. స్వేచ్ఛగా ఈ కథనాలు ప్రతిరోజూ అందుతున్నాయి.
ఈ పరిస్థితిని గమనించినప్పుడే.. అసలు ఈ పరిణామాల పట్ల సీబీఐ సిగ్గుపడుతోందా? లేదా? అనే అనుమానం కలుగుతుంది. సీబీఐ అంటే ముందే చెప్పుకున్నట్టు ఈ దేశంలోనే అత్యున్నత నేర విచారణ సంస్థ! వారు చేసే దర్యాప్తు వివరాలను అంతే గోప్యంగా ఉంచడం కూడా వారి బాద్యత.
తమ దర్యాప్తులో వెల్లడైన వాంగ్మూలాలనే భద్రంగా, గోప్యంగా ఉంచడం చేతకాని అసమర్థులు.. ఇక ఏం సాదిస్తారని ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తే ఎలా? అంత పెద్ద సంస్థ పరువు పోతుంది కదా? ఈ కనీస ఆలోచన ఆ సంస్థకు కలుగుతోందా? లేదా? అని ప్రజలు విస్తుపోతున్నారు.
సీబీఐ విచారణ అంటే చాలా గొప్పగా అందరూ అనుకోవడం సహజం. కానీ.. ఆ విచారణలో ఏం చెప్పినా అది ఇట్టే బయటకు వచ్చేస్తుందని.. మీడియా చెంతకు వెళ్లిపోతుందని ప్రజలకు అభిప్రాయం ఏర్పడకుండా ఉంటుందా? పైగా కల్లూరు గంగాదర రెడ్డి లాంటి వాళ్లు.. అవినాష్ కు వ్యతిరేకంగా చెప్పమని సీబీఐ అధికారులే తనతో డీల్ మాట్లాడినట్టుగా ఆరోపించారు.
సీబీఐ అధికారులు తనతో తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారని కూడా ఆరోపించారు. మరో నిందితుడు.. ఏకంగా సీబీఐ విచారణాదికారి మీద బెదిరిస్తున్నారంటూ పోలీసు కేసు పెట్టారు. ఇన్ని ఆరోపణలు, విమర్శలు, వివాదాలు చుట్టుముడుతూ ఉన్న సమయంలో.. సీబీఐ అనేది పచ్చపత్రికల తరఫున కాంట్రాక్టు కుదుర్చుకుని పనిచేస్తున్న, వివరాలు సేకరిస్తున్న ఏజన్సీ లాగా.. అన్నీ లీకైపోతున్నందుకు వారు సిగ్గుపడాలా అక్కర్లేదా? అని ప్రజలు సందేహిస్తున్నారు.