ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ–2 నిందితునిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి మూడురోజుల విచారణ పూర్తయింది. ఈ మూడు రోజుల విచారణకు సంబంధించి ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అచ్చెన్న నిశ్చింతగా బయటపడినట్టే అనే అభిప్రాయం కలుగుతుంది. మరోవైపు ఏసీబీ విచారణకు అచ్చెన్నకు సహకరించలేదని, అరకొర సమాధానాలు.. దాటవేత ధోరణి అవలంబించినట్టు ప్రచారం జరుగుతోంది. ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం(సీఐయూ) డీఎస్పీలు పీఎస్‌ఆర్కే ప్రసాద్, చిరంజీవితో కూడిన బృందం గుంటూరు జీజీహెచ్‌లో 25, 26, 27 తేదీల్లో అచ్చెన్నాయుడిని విచారించింది.
మరో వైపు ఇదే కేసులో వేర్వేరు ప్రాంతాల్లో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను ఏసీబీ రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుంది. రెండు రోజుల విచారణలో వీళ్లేం చెప్పారనే దానిపైనే అచ్చెన్న భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
ఏసీబీ అధికారులు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజుల్లో మొత్తం 12.30 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో అచ్చెన్నాయుడు ప్రధానంగా ఈ స్కాంతో తనకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఏ నిందితుడైనా తాను తప్పు చేశానని ఒప్పుకోవడం చూశామా? ఇప్పుడు అచ్చెన్న విషయంలో కూడా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.
కేవలం అచ్చెన్నాయుడు ఇచ్చిన సమాధానాలపై కేసు ఆధారపడి లేదు. అసలు సంగతి వేరే ఉంది. రెండురోజుల విచారణలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, ఇతర చిన్నస్థాయి అధికారులు ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేదే ఇప్పుడు ప్రధానాంశం. ఈఎస్ఐలో స్కాం జరగలేదని అచ్చెన్నాయుడు కూడా చెప్పడం లేదు. ఆ స్కాంతో తనకు సంబంధం లేదని మాత్రమే ఆయన చెప్పుకొచ్చారు. తాను కేవలం నిమిత్తమాత్రుడినని, అంతా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరిగిందని విచారణలో ఆయన చెప్పారని టీడీపీ సొంత పత్రికల్లో మూడు రోజులు వరుస కథనాలు రాయడాన్ని చూశాం.
మొదటి రోజు విచారణలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని “టెలీ హెల్త్ సర్వీసెస్ వ్యవహారంలో మీరు ఓ కంపెనీకి సిఫార్సు చేస్తూ సంతకం పెట్టారు. అంటే ఆ కంపెనీకే టెండర్లు ఇవ్వాలని చెప్పటమే కదా” అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
రెండో రోజు శుక్రవారం విచారణలో “మంత్రి హోదాలో ఏకంగా ఐదు లేఖలు రాశారు. అందువల్లే ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్‌కుమార్ భయపడి మీ సిఫార్సును ఆమోదించారు. దీనిపై ఏమంటారు” అని ఏసీబీ ప్రశ్నించింది. ఈఎస్ఐ మందులు, పరికరాళ్ల కొనుగోళ్ల వ్యవహారంలో తాను డైరెక్టర్‌పై ఎలాంటి ఒత్తిడి తేలేదని ,సలహాపూర్వకంగా మాత్రమే లేఖలు రాశానంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.
ఇక మూడో రోజు శనివారం విచారణలో భాగంగా “టెలీహెల్త్ సర్వీసెస్ కంపెనీ నిర్వాహకులతో మీకున్న సంబంధాలు బంధు త్వమా? లేక టెండర్ ఇవ్వడం ద్వారా వ్యక్తిగత వ్యక్తిగత లబ్ధి చేకూరుస్తామని కంపెనీ నిర్వాహకులు ఏమైనా ఆఫర్ ఇచ్చారా? అని ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే కొనుగోళ్లులో కలిగిన లబ్ధిని ఎవరెవరు, ఎంతెంత వాటాలుగా తీసుకున్నార”ని ప్రశ్నలు వేశారు.
అచ్చెన్న ప్రధానంగా టెలీహెల్త్ సర్వీసెస్, వీఆర్ టెలీ హెల్త్ సర్వీసెస్ సంస్థల డైరెక్టర్లతో తనకు ముఖ పరిచయం లేదని, వారెవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. అలాగే లేఖలు మాత్రమే రాశానని, మాటమాత్రంగా సిఫార్సులు చేశానని అంగీకరిం చారు. ఆ తర్వాత జరిగిన ఒప్పందాలు, సంతకాలు తదితర అంశాల్లో తన ప్రమేయం లేదని చెప్పారు.
ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ విచారణకు సంబంధించి నాణేనికి ఒక వైపు మాత్రమే మనకు తెలుసు. నాణేనికి రెండో వైపు అంటే…రెండు రోజుల విచారణలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు, ఇతర అధికారులు ఏం చెప్పారో ఎవరికీ తెలియదు. తెలియదంటేనే ఏదో మతలబు వుందని అర్థం. అచ్చెన్నాయుడి సమాధానాలు మాత్రమే ప్రధానంగా టీడీపీ అనుబంధ పత్రికల్లో ప్రాధాన్యానికి నోచుకోవడం వెనుక రాజకీయ కోణం లేకపోలేదు.
చూడండి…అచ్చెన్నాయుడు ఎంత అమాయకుడో. ఆయన నిరపరాధనే విషయం ఆయన సమాధానాలే చెబుతున్నాయని నమ్మించే కుట్రలో భాగమే ఇవన్నీ. అచ్చెన్నాయుడిని బయటపడేసేందుకు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు, ఇతర అధికారులు తమను తాము బలి చేసుకునే ప్రశ్నే ఉండదు. అందువల్ల అచ్చెన్నాయుడు చెప్పిందే నిజమని, ఒకవేళ సమాధానాలు దాట వేసినంత మాత్రాన నిర్దోషిగా బయటపడతారని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు.
ఎందుకంటే ఈఎస్ఐలో స్కామ్ జరిగిందని అచ్చెన్నాయుడితో సహా అందరూ అంగీకరిస్తున్నారు. కానీ తాము మాత్రం అవినీతికి పాల్పడలేదని అచ్చెన్నతో సహా అందరూ తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఇక తేల్చాల్సింది ఏసీబీ నివేదికే. ఇప్పుడు ఏసీబీ ఇచ్చే నివేదికపై అచ్చెన్నకు ఇంటి దారా? లేక జైలు దారా? అనేది ఆధారపడి ఉంది.