ప్రభుత్వ పాఠశాల్లో చదివే పేద, సామాజిక వెనుకబాటుకు గురైన పిల్లలకు ఆంగ్ల విద్య అందించాలనే సదాశయంతో జగన్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం తప్పని సరి చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవో ప్రకారం తెలుగు సబ్జెక్ట్ తప్పని సరి.
అయితే ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలుగు భాష అంతరించి పోయే ప్రమాదం ఉందంటూ ప్రధాన ప్రతిపక్షాలు, పలు ప్రజాసంఘాలు, తెలుగు భాషాభిమానులు గగ్గోలు పెట్టారు. చివరికి ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. ఏది ఏమైతేనేం హైకోర్టు ఆ జీవోను కొట్టి వేసింది. ఏ మీడియంలో చదవాలో విద్యార్థుల నిర్ణయానికే వదిలేయాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాల్లో మాదిరిగానే తెలుగు మాధ్యమాన్నిఅమలు చేయాలనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గరీబ్ గైడ్ సంస్థ అధ్యక్షురాలు భార్గవి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయ మూర్తి జస్జిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ దేవానంద్‌తో కూడిన ధర్మాసనం విచారణలో భాగంగా పిటిషనర్‌కు ఓ అవకాశాన్ని ఇచ్చింది.
ప్రైవేట్ పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని అమలు చేసే అంశంపై సంబంధిత అధికారుల్ని కోరేందుకు పిటిషనర్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం అమలుపై హైకోర్టు తాజాగా ఆదేశం లేదా అభిప్రాయం ఏంటో తెలిసింది కదా!