పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ని బాగానే ఉపయోగిస్తుంటారు. తన పేరుతో విడుదలయ్యే ప్రెస్ నోట్లన్నీ జనసేన పార్టీ అకౌంట్ నుంచే పోస్ట్ చేసినా.. ప్రత్యేకంగా వాటిని తాను రీట్వీట్ కొడుతుంటారు. ఇక బీజేపీ పెద్దల ప్రసంగాల కోసం, పుట్టినరోజులు, జయంతులు, వర్థంతులు.. వగైరా వగైరా పొగడ్తల కోసం తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ ని ఉపయోగిస్తుంటారు. అయితే గడిచిన 12 రోజులుగా పవన్ కల్యాణ్ పర్సనల్ అకౌంట్ నుంచి కొత్త ట్వీట్ ఏదీ పడలేదు.
పోనీ ఆ టైమ్ లో ఆయన ఖాళీగా ఉన్నారా అనుకుంటే అదీ లేదు. పవన్ సైన్ చేసి పంపించే ప్రెస్ నోట్లన్నీ జనసేన అకౌంట్ నుంచి పడుతున్నాయి. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయండి అంటూ పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తూ పెట్టిన మెసేజ్ ని ఇంకా తన ప్రాధాన్యత పోస్ట్ గా ఉంచటం చూస్తుంటే.. ఆయన అకౌంట్ కచ్చితంగా హ్యాక్ అయిందనే అర్థం చేసుకోవాలి.
ఈనెల 16న పదో తరగతి పరీక్షలు వాయిదా కోసం పవన్ ఓ ట్వీట్ పెట్టారు. కరోనా భయంతో అసెంబ్లీ సెషన్ ని 2రోజులకు కుదించిన వైసీపీ సర్కారు.. పదో పరీక్షల్ని ఎలా నిర్వహిస్తుందంటూ ఆయన ప్రశ్నించిన ట్వీట్ అది, టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఓటు హక్కు లేదనేగా మీ ధైర్యం అంటూ కాస్త వ్యంగ్యం కూడా ఉంది ఆ ట్వీట్ లో. ఆ తర్వాత ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయడం, దాన్ని పవన్ ప్రశంసించడం రెండూ జరిగాయి. అయితే పవన్ ఎకౌంట్ లో ఇంకా పదో తరగతి పరీక్షల వ్యవహారమే హైలెట్ చేసి ఉంది.
దీన్నిబట్టి చూస్తే.. పవన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడం కానీ, లేదా ఆయన తన అకౌంట్ ని పట్టించుకోకపోవడం కానీ జరిగి ఉండాలి. ఒకవేళ హ్యాక్ అయితే.. దాని నుంచి ఈపాటికే చిత్ర విచిత్ర పోస్టులు వచ్చి ఉండేవి. అలా జరగలేదు కాబట్టి.. పవన్ తన ట్విట్టర్ ఖాతాను లైట్ తీసుకున్నారనే అనుకోవాలి. లేదంటే బీజేపీ నుంచి ఈమధ్య కాలంలో ఎవ్వరి పుట్టినరోజులు లేవని అర్థం చేసుకోవాలి. లేదంటే కేంద్రం కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని కూడా అర్థం చేసుకోవచ్చు.