ఎక్కడ ఏ మంచి జరిగినా తమ ఖాతాలో వేసుకోవడం టీడీపీ నేతలకు అలవాటైంది. ఇదంతా అధినేత చంద్రబాబు నుంచి అబ్బిన విద్య. హైదరాబాద్ కట్టింది తానేనని, కంప్యూటర్ కనుగొన్నది కూడా తానే అని పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పి అభాసు పాలయ్యారు. బాబు తనయుడు లోకేశ్ తానేం తక్కువ తినలేదని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో టీడీపీ పాల్గొందని, అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చేలా ఉందని లోకేశ్ గతంలో మాట్లాడ్డం తెలిసిందే.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాటలు వింటే… అర్రె అచ్చం లోకేశ్‌లా మాట్లాడుతున్నారే అనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే లోకేశ్‌బాబు తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్ సృష్టించుకున్నారు. విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి అచ్చెన్నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సినీ రంగం ద్వారా తెలుగుజాతికి ఎన్టీఆర్ మంచి పేరు తీసుకొచ్చారన్నారు. రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. బడుగుబలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
మోదీ ప్రధాని అయ్యారంటే కారణం ఎన్టీఆరే అని అచ్చెన్నాయుడు చెప్పడం విశేషం. ఏ రకంగా ఎన్టీఆర్ కారణంగా మోదీ ప్రధాని అయ్యారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేస్తే… గుజరాత్‌లోని నరేంద్రమోదీ ఎలా ఎదిగారన్నది అర్థం కాని ప్రశ్న.
ఎన్టీఆర్ నిర్ణయాలు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపాయనా? అచ్చెన్నాయుడి మాటల అంతరార్థం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా లోకేశ్ మాట్లాడాల్సిన అంశాలు, అచ్చెన్నాయుడు అత్యుత్సాహంతో నోరు పారేసుకుంటున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.