మొత్తానికి అచ్చెన్నాయుడుని ఉత్తరాంధ్రాకే పరిమితం చేస్తున్నారా అన్న చర్చ అయితే టీడీపీలో సాగుతోంది. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడుని ప్రకటించినా ఏపీవ్యాప్తంగా అచ్చెన్న పెద్దగా పర్యటించిన దాఖలాలు లేవు. ఇక ఆయన ఉంటే సొంతూరు లేకుంటే విశాఖ అన్నట్లుగా గత ఏడాదిగా గడిపేశారు.
చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నా ఆయనే ఏపీకి అసలైన ప్రెసిడెంట్. ఆయనే పార్టీని నడిపిస్తున్నారు. మరో వైపు ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా చినబాబు లోకేష్ రంగంలోకి దిగిపోతున్నారు. ఈ పరిణామాలతో అచ్చెన్నాయుడు పూర్తిగా తగ్గిపోయారు.
ఇదిలా ఉంటే విశాఖలో టీడీపీ నిర్వహించిన ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద సమావేశానికి మాత్రం అచ్చెన్నాయుడే అధ్యక్షత వహించారు. ఇక్కడ ఆయనకు చినబాబు పెదబాబుల నుంచి పోటీ ఎదురుకాలేదు. దాంతో అచ్చెన్నకు ఉత్తరాంధ్రా మూడు జిల్లాల ప్రెసిడెంట్ బాధ్యతలే అప్పగించారన్న మాట అనుకోవాల్సి వస్తోంది తమ్ముళ్ళు.
ఇక ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద చర్చకు వైసీపీ రావాలని సవాల్ చేసిన అచ్చెన్నాయుడు దానికి ఆ మూడు జిల్లాల మంత్రులు వద్దుట, ఏకంగా జగనే రావాలని కోరడం విడ్డూరం. మరో వైపు ఉత్తరాంధ్రాను పూర్తిగా పడకేయించిన టీడీపీతో తమకు చర్చలేంటి అని వైసీపీ నేతలు గట్టి కౌంటరే ఇస్తున్నారు.
ఏది ఏమైనా అచ్చెన్నాయుడు ఏపీ ప్రెసిడెంట్ అయిన ఇన్నాళ్ళకు ఒక కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు అని ఆయన అనుచరులు సంబరపడడమే మిగిలింది.