టీఆర్ఎస్ వైపు పోసాని కృష్ణమురళి, దర్శకుడు ఎన్.శంకర్ లు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి.. తమ వాదన వినిపించగా, బీజేపీ వైపు రంగంలోకి దిగారు సీనియర్ నటి కవిత, మరో నటుడు సీవీఎల్ నరసింహారావు.
వీరు బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ టీఆర్ఎస్ తరఫున వాణి వినిపించిన దర్శకుడు ఎన్.శంకర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. పోసానిని విమర్శించేందుకు ఎలాగూ విషయం లేదు కాబట్టి, ఆయనను పక్కన పెట్టి భూములు తీసుకున్నారంటూ శంకర్ పై ధ్వజమెత్తారు.
గతంలో కవిత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో పని చేసినట్టున్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వైపు మాట్లాడారు, కొంతకాలం టీడీపీలో పనిచేశారు కూడా. ఇప్పుడు ఈమె బీజేపీ వైపున వకల్తా పుచ్చుకున్నారు.
ఇక సీవీఎల్ నరసింహారావు గతంలో లోక్ సత్తా తరఫున టీవీ చర్చల్లో పాల్గొన్నట్టున్నారు. అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు టీవీ కార్యక్రమాల్లో విమర్శలు చేశారు సీవీఎల్. ఈయన ఇప్పుడు బీజేపీ తరఫున స్పందించారు.
తెలంగాణ సినిమాను టీఆర్ఎస్ చంపేసిందన్నట్టుగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ హిందువుల ఉంటామన్నందుకు టీఆర్ఎస్ రచ్చ చేస్తోందని సీవీఎల్ విమర్శించారు. హిందువులను చంపేస్తాం, ఆవులను చంపేస్తామంటూ మాట్లాడినప్పుడు ఎవరికీ అభ్యంతరం లేకపోయిందా? అంటూ సీవీఎల్ ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్ అల్లకల్లోలం పట్టించిందని, ప్రజల కోసం బీజేపీ నెగ్గాలని, బీజేపీ నెగ్గితే ఏం చేస్తామో చూపిస్తాం.. అంటూ కవిత ప్రకటించేశారు. మొత్తానికి గ్రేటర్ పోరులో స్టార్ నటీనటులు ఎవరూ రంగంలోకి దిగకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ వంతు పాత్రను పోషిస్తున్నట్టున్నారు.