ఒక్కోసారి తెగేవరకు లాగకూడదు. అందులోనూ వ్యవహారం పూర్తిగా తెలిసిన తరువాత ఎక్కడో ఒక దగ్గర స్కిప్ చేయాలి కానీ, పట్టుకుని వేలాడకూడదు. అలా చేస్తే మంత్రి గుడివాడ అమర్ నాధ్ వ్యవహారం మాదిరిగా మారిపోతుంది. ఇప్పుడు అమర్ నాధ్ ను సోషల్ మీడియాలో జనసైనికులు ఆడేసుకుంటున్నారు.
విషయం ఏమిటంటే సిఎమ్ జగన్ కు మద్దతుగా మాటలతో అడ్డంగా నిలబడిపోయే వారిలో గుడివాడ అమర్ నాధ్ ఒకరు. ఆయన పార్టీ, ఆయన రాజకీయం. ఆయన ధర్మం. ఆ విధంగానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన స్టయిల్ లో, ఆయన రేంజ్ లో చెలరేగిపోయారు. సహజంగానే అట్నుంచి కౌంటర్లు పడ్డాయి. అందులో ఒకటి ఏమిటంటే పవన్ తో ఎందుకు ఫొటొ దిగారు అన్నది.
తను ఎందుకు ఫొటొ దిగారు. ఎప్పుడు దిగారు. ఎలా దిగారు అన్నది గుడివాడకు క్లారిటీ వుండి వుండాలి కదా. అలాంటపుడు గమ్మున వుండాలి. అలా వుండకుండా రివర్స్ లో వెళ్లారు. తనతో ఎందరో అభిమానులు ఫొటొలు దిగారని పవన్ నే తనతో అలా దిగి వుంటారని సెటైర్లు వేసారు. పైగా పవన్ చేతులు కట్టుకుని వున్నదాన్ని కూడా డ్రమటైజ్ చేసారు.
కానీ ఇది డిజిటల్ యుగం కదా, జన సైనికులు మొత్తం తవ్వి తీసారు. తీస్తే ఏమయింది? గుడివాడనే వెళ్లి పవన్ ను కలిసి ఫొటో దిగినట్లు బయపడింది. ఆ పొటోలో ఇంకా వేరే వాళ్లు కూడా వున్నారు. జనసైనికులు అక్కడితో ఆగలేదు. గతంలో ఏదో వేదిక మీద గుడివాడ మాట్లాడుతూ తాను మెగాస్టార్ అభిమానిని అని, పవర్ స్టార్ అభిమానిని అని ఫ్యాన్స్ ను ఉర్రూత లూగించే ప్రసంగం చెేసారు. ఆ వీడియో బయటకు తీసారు.
మొత్తానికి ఇదేమీ పెద్ద వివాదం కాదు. రాజకీయాల్లో నోరు జారి దాన్ని సర్దుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు చేయడం కూడా మామూలే. అయితే ఈసారి అయినా గుడివాడ కాస్త జాగ్రత్తగా వుండాలి.