గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విభేదాలున్నాయి. పరస్పరం ఎదురు పడడానికి, మాట్లాడ్డానికి కూడా అంగీకరించని పరిస్థితి. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎం మధ్య గ్యాప్ రావడానికి కారకులెవరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్, తమిళిసై మధ్య విభేదాలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందరే కారణమని కిషన్‌రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం.
బీజేపీ మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే గవర్నర్‌పై కేసీఆర్‌కు కోపం వచ్చిందన్నారు. అందుకే గవర్నర్‌ను కేసీఆర్ తరచూ అవమానిస్తున్నారన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ వెళితే కలెక్టర్, ఎస్పీ లేకపోవడం అవమాన కరమన్నారు.
టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేసీఆర్, కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ… ఎమ్మెల్యే, పార్టీ పదవులకు ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటలను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ప్రభుత్వం కౌశిక్‌రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకుంది.
సేవారంగం నుంచి ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే కౌశిక్‌రెడ్డి సేవారంగం కిందకు రారని గవర్నర్ పెండింగ్ పెట్టారు. అప్పటి నుంచి విభేదాలు పెరుగుతూ వెళ్లాయి.
ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఆ విషయాన్నే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించడం గమనార్హం. ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.