మంత్రి పదవే కాదు, ఆయనలో మునుపటి ఉత్సాహం కూడా పోయింది. ఒక రకమైన నిరాశనిస్పృహలు ఆయనలో అలుముకున్నాయి. మంత్రి పదవిలో ఉండగా పులిలా గాండ్రించిన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, ప్రస్తుత పిల్లిలా మారిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయాలు ఆయన్ను ఒంటరి చేశాయి.
కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే ఆయనకు ఏకైక అండ. జిల్లాలో మిగిలిన ఏ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు ఆయన్ను ఆదరిస్తున్న దాఖలాలు లేవు. వాస్తవాలు కఠినంగా ఉన్నప్పటికీ, జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతాననే గ్రహింపు ఆయనలో కలిగింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ప్లెక్సీల వ్యవహారంపై అనిల్‌కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై నెల్లూరు సిటీలో ప్లెక్సీల గొడవే వుండదన్నారు. ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. రెండున్నరేళ్లుగా ఫ్లెక్సీరహిత నగరంగా నెల్లూరు సిటీని ఉంచగలిగామని, అయితే కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అనిల్‌కుమార్ యాదవ్ వాపోయారు. ముఖ్యంగా సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో నిషేధాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పడం గమనార్హం.
‘ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు’ అని అనిల్‌కుమార్ యాదవ్ నిర్వేదంతో అన్నారు. ఇటీవల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అలాగే ఆనం ఇంటి వద్ద కట్టిన ప్లెక్సీలను కూడా తొలగించడం వెనుక అనిల్ అనుచరులున్నారనే ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కట్టిన ప్లెక్సీలను తొలగించడం వెనుక ఎవరున్నారనే ప్రశ్నకు … వేళ్లన్నీ మాజీ మంత్రి వైపే వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంపై అనిల్ నొచ్చుకున్నారు.
ఉద్దేశపూర్వకంగానే తనపై నిందలు మోపుతున్నారని అనిల్ చెబుతున్నారు. అసలు ప్లెక్సీల నిషేధాన్నే తొలగిస్తే …ఏ గొడవా వుండదనే ఉద్దేశంతో అనిల్ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారనే చర్చకు తెరలేచింది.