ఇటీవల కాలంలో ఏదో రకమైన తప్పు జరగడం, అది ప్రభుత్వానికి అప్రతిష్ట తేవడం షరా మామూలైంది. విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం ఘటనలో సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళుతున్న వినుకొండ భక్తుల కారు తీసుకెళ్లడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనలో ఆర్టీఏ అధికారి, ఒక హోంగార్డుపై సస్పెన్షన్ వేటు పడింది.
రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ దుర్ఘటనలు జరుగుతూనే వున్నాయి. ఈ దఫా తిరుపతి వంతు వచ్చింది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన ఓ కూలీ తన 9 ఏళ్ల కుమారుడికి అనారోగ్యంగా ఉండడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లాడు. కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో సోమవారం రాత్రి 11 గంటలకు బాలుడు తుదిశ్వాస విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లాలని తండ్రి భావించాడు. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్వేలికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయాలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ రూ.10 వేలు అడిగాడు.
తన దగ్గర అంతస్తోమత లేదన్నాడు. గ్రామంలో ఉన్న బంధువులకు మృతదేహం తరలింపు విషయాన్ని చెప్పడంతో, అక్కడి నుంచి ఉచిత అంబులెన్స్‌ను పంపించారు. అయితే ఇతరులెవరినీ రుయాలోకి అడుగు పెట్టుకుండా ఆ ఆస్పత్రి అంబులెన్స్ ముఠా అడ్డుకుంది. చిట్వేలి నుంచి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్‌ను కొట్టి వెనక్కి పంపారు. దీంతో బాధితుడు చేసేదిలేక కుమారుడి మృతదేహాన్ని మోటార్ బైక్‌పై ఊరికి తీసుకెళ్లాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రుయా అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాన్ని ప్రభుత్వ మెడకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చుట్టేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ రుయా వద్ద ధర్నాకు దిగాయి. ప్రభుత్వం కనీసం మృతదేహాన్ని తరలించే పరిస్థితిని కూడా కల్పించలేదా? అని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై సీఎం జగన్, మంత్రి విడదల రజనీ సీరియస్ అయ్యారని, వెంటనే కఠిన చర్యలకు ఆదేశించారనే మొక్కుబడి ప్రకటనలు రానట్టుంది. అంబులెన్స్ ముఠాకు సహకరిస్తున్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఇంకా సస్పెన్షన్ వేటు వేయలేదు. బహుశా ఆ పని ఈ రోజో, రేపో ప్రభుత్వం చేయొచ్చని, పరిపాలనా తీరును గమనిస్తున్న వారు చెబుతున్నారు.