ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగే రైడర్లు చాలామంది ఉంటారు. దొరికినప్పుడు కొంతమంది అక్కడే బండి వదిలేసి వెళ్తుంటారు. మరికొందరు వేల రూపాయలు చాలాన్లు కట్టి బయటపడతారు. కానీ ఇక్కడో వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు దొరికిన వెంటనే తన బైక్ కు నిప్పుపెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది ఈ ఘటన.
ఖానాపూర్ కు చెందిన మక్బుల్ కు AP 01H 8085 అనే బైక్ ఉంది. కానీ దానికి సరైన పేపర్లు లేవు, దానికి తోడు ట్రాఫిక్ నిబంధనలు కూడా సరిగ్గా పాటించలేదు. దీంతో ప్రతిసారి అతడి బైక్ పై చలాన్ పడుతోంది. అప్పుడప్పుడు అతడు ఆ ఫైన్లు కడుతూ వస్తున్నాడు. కానీ బండి పేపర్లు మాత్రం మెయింటైన్ చేయడం లేదు.
ఈ క్రమంలో మరోసారి మక్బుల్ బైక్ ను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముందు రోజే వెయ్యి రూపాయలు ఫైన్ కట్టిన ఫ్రస్ట్రేషన్ లో ఉన్న మక్బుల్ ఈసాకి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన బైక్ పెట్రోల ట్యాంక్ తెరిచి, అగ్గిపుల్ల గీసి అందులో వేశాడు. ఒక్కసారిగా బైక్ భగ్గుమంది.
ఊహించని పరిణామంతో షాక్ తిన్న ట్రాఫిక్ పోలీసులు, హుటాహుటిన బైక్ నుంచి వచ్చిన మంటల్ని ఆర్పేశారు. ప్రతిసారి బైక్ ఆపి ఫైన్ అడుగుతుంటే చిరాకొచ్చిందని, అందుకే తగలబెట్టానని మక్బుల్ మీడియాకు చెప్పాడు. అటు పోలీసులు మాత్రం తాము నిబంధనల మేరకే నడుచుకున్నామని, ఫైన్ కోసం మక్బుల్ ను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదన్నారు. మక్బుల్ వద్ద బండి కాగితాలు లేవన్నారు.
మొత్తానికి మక్బుల్ చేసిన ఈ పనితో ఇప్పుడు అతడిపై పోలీస్ కేసు నమోదైంది. నడిరోడ్డుపై బైక్ కు నిప్పుపెట్టి ప్రమాదానికి కారణమైనందుకు, ఫైన్ ఎగ్గొట్టినందుకు, దురుసుగా ప్రవర్తించినందుకు.. ఇలా పలు కారణాలపై మక్బుల్ పై కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.