భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముందు తెలుగుదేశంలోని నేతలు ఒకసారి వెళ్లి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆశీస్సులు తీసుకోవడం కొనసాగుతున్నట్టుగా ఉంది. ఇప్పటివరకూ భారతీయ జనతా పార్టీలోకి చేరిన తెలుగుదేశం నేతలంతా ముందుగా వెళ్లి చంద్రబాబు నాయుడును కలవడం జరుగుతూ ఉంది. చంద్రబాబును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకునేవాళ్లు బీజేపీలోకి వెళ్లిపోతున్నారనే టాక్ కొనసాగుతూ ఉంది.
ఆ విషయంపై కొందరు నేతలు కూడా క్లారిటీ ఇచ్చారు. ఎంపీ టీజీ వెంకటేష్ ఈ విషయాన్ని సూటిగా చెప్పారు. తాము బీజేపీలోకి చేరాలనుకున్న విషయాన్ని చంద్రబాబుకు ముందే చెప్పినట్టుగా ఆయన వివరించారు. వారం ముందుగానే చంద్రబాబుకు సమాచారం ఇచ్చి తాము బీజేపీలోకి చేరినట్టుగా ఆయన తెలిపారు. పార్టీ మారే విషయాన్ని చెప్పినా చంద్రబాబు నాయుడు వద్దు అనలేదని విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారు.
ఇక ఇప్పటివరకూ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలోకి చేరిన వాళ్లంతా కూడా చంద్రబాబు నాయుడుకు అన్ని రకాలగానూ ఆత్మీయులు, శ్రేయోఃభిలాషులే అనే సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో అలా చంద్రబాబుకు సన్నిహితుడుగా మెలిగిన ఆదినారాయణ రెడ్డి కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్లి చంద్రబాబుతో సమావేశం కావడం కూడా జరిగింది.
ఆదినారాయణ రెడ్డి బొక్కలు చాలానే ఉన్నాయని అంటున్నారు కడపజిల్లా ప్రజలు. తాము దోచుకుంటున్న వైనాన్ని ఎలా వాటాలు వేసుకుంటున్నది కూడా అప్పట్లో ఆదినారాయణ రెడ్డి వివరించి చెప్పారు కూడా. ఇలాంటి నేపథ్యంలో విచారణలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆదినారాయణ రెడ్డి రూటు మారుస్తున్నారని భోగట్టా.
బీజేపీలోకి చేరితే తను పునీతుడు అయిపోవచ్చని ఆయన అనుకుంటున్నారట. అందుకే అందుకోసం ముందుగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు కోరారని.. చంద్రబాబుకు అక్కడ ఉండి సపోర్ట్ చేసే హామీని ఇచ్చేందుకు వెళ్లి సమావేశం అయ్యి, ఆశీస్సులు కూడా పొందారని టాక్!