ఆంధ్ర వైకాపా ప్రభుత్వ హయాంలో కష్టసాధ్యమైన పని ఏది? ఎమ్మెల్యేలు కావచ్చు. మంత్రులు కావచ్చు. మినిస్ట్రియల్ సెక్రటరీలు కావచ్చు. పార్టీ నేతలు కావచ్చు. వివిఐపిలు కావచ్చు. వీరందరికీ కష్టసాధ్యమైన పని ఒకటే. సిఎమ్ జగన్ అపాయింట్ మెంట్ సంపాదించడం. అవును..ఇదే ఇప్పుడు ఆంధ్రలోని రాజకీయ, అధికార వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త.
దాదాపు ఎమ్మెల్యేలలో సగం మంది జగన్ అపాయింట్ మెంట్ కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. అపాయింట్ మెంట్ మాట సరే, పోనీ ఏదో ఒక సమీక్షా సమావేశంలోనో, మరో సందర్భంలోనో కలిసి మనసులోని మాట విన్నవించుకోవాలి అనుకుంటే, అది కూడా అంత వీజీ కాదు.
ముందుగానే వారి వ్యవహారం గమనించి సిఎమ్ జగన్ సింపుల్ గా అక్కడి నుంచి పని పూర్తి కాగానే చటుక్కున వెళ్లిపోతున్నారని బోగట్టా. అసలు ఈ అపాయింట్ మెంట్ దొరక్కే కదా, రఘరామకృష్ణం రాజు వ్యవహారం విత్తనం వేసుకున్నది. అక్కడి నుంచే కదా అది మర్రిమానుగా మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి అపాయింట్ మెంట్ అడిగారని ఇప్పటి వరకు దొరకలేదని వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తూనే వున్నాయి. అయితే అలా అని కొందరికి అపాయింట్ మెంట్ లు సులువుగానే దొరుకుతున్నాయని బోగట్టా. ఓ ఛానెల్ అధినేత ఆ మధ్య ఇలా అమరావతి వెళ్లి అలా సిఎమ్ ను కలిసి వచ్చేసారు.
ఆంధ్రలోని అత్యంత కీలక శాఖ కార్యదర్శికి ఇప్పటికి అతి కష్టం మీద రెండు సార్లు సిఎమ్ అపాయింట్ మెంట్ దొరికినట్లు బోగట్టా. నిజానికి ఆ శాఖ కార్యదర్శి అంటే ఇలా అనుకున్నపుడల్లా అలా సిఎమ్ ను కలిసే అవకాశం వుంటుంది.
ప్రస్తుతం అధికార రాజకీయ వర్గాల్లో జగన్ వ్యవహార శైలి పూర్తిగా అర్థం అయిపోయిందట. దాంతో అపాయింట్ మెంట్ దొరక్క పోయినా వాళ్లేమీ పెద్దగా ఫీల్ కావడం లేదట. దొరికితే మాత్రం అదే పదివేలు అన్నట్లు ఫీలవుతున్నారట.