తెలంగాణా సీఎం దళిత బంధు పథకాన్ని తెచ్చింది హుజూరాబాదులో ఓట్ల కోసమే అని స్పష్టంగా తేలిపోయింది. ఆ విషయం కేసీఆరే చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఎలాంటి పథకాన్ని ప్రవేశ పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి హడావుడిగా దళిత బంధు ప్రకటించారు కేసీఆర్. దళితబందును బ్రహ్మాండమైన పథకంగా కేసీఆర్ భావిస్తున్నారు. ఆవిధంగా ప్రచారం చేస్తున్నారు.
దళితుల కోసం పథకం అంటే ప్రతిపక్షాలు కూడా ఏమీ మాట్లాడలేవు. ఆ పథకానికి వ్యతిరేకంగా ఏమీ కామెంట్ చేయలేవు. దళితులకు అనుకూలంగా ఏం మాట్లాడినా, ఎలాంటి పథకం ప్రవేశపెట్టినా అందుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక ఆ రాజకీయ పార్టీ పని అయిపోయినట్లే. దళితుల ఓట్లు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదు కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడటానికి అవకాశం లేదు. కాబట్టి దళిత బందును కాదనకుండా కేసీఆర్ ను దెబ్బ కొట్టడమెలా అని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్న క్రమంలో అసలే దూకుడు నాయకుడైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గిరిజనులను తెర మీదికి తెచ్చాడు.
దళితులకు పది లక్షల చొప్పున ఇస్తే మరి సామాజికంగా అట్టడుగున ఉన్న గిరిజనుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. వారికి సాయం చేయక్కరలేదా అని అడుగుతున్నాడు. ఎస్టీ వర్గాల్లో ఈ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాడు. సామాజిక పరంగా దళితుల కన్నా బాగా వెనుకబడిన వారు ఎస్టీ వర్గాలు. నిరుపేదలు ఎక్కువ. రిజర్వేషన్ల ఫలాలు పొందిన అతి కొద్ది మంది… మళ్లీ మళ్లీ రిజర్వేషన్లు పొందుతున్నారు కానీ… ఆ వర్గాల్లో వెనుకబడిన వారు వెనుకనే ఉన్నారు.
అత్యంత పేదరికంలో ఉన్నారు. దళితులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న సాయం చూసి.. వారికి కూడా తాము మాత్రం ఎందుకు అభివృద్ధి చెందకూడదన్న అభిప్రాయం వారి మనసుల్లోకి వచ్చింది అంటూ వ్యూహాత్మకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం దళిత, గిరిజన దండోరా నిర్వహణకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడు.
ఇలా అన్ని వర్గాల వద్దకూ వెళ్లి… రూ. పది లక్షల కోసం కేసీఆర్‌పై ఒత్తిడి పెంచేలా.. ఆయన ప్రచార ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. ఇతర పార్టీలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి. ఎన్నికలకు ముందే దళితులకు రూ. పది లక్షలు పంచాలని.. అదీ కూడా రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో తెలంగాణ అధికార పార్టీకి ఇబ్బందులు ప్రారంభమయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రూ. లక్ష కోట్లయినా దళితుల కోసం పంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అది కేవలం.. దళితులకు మాత్రమే. కేసీఆర్ ఎక్కడో చోట లక్ష కోట్లను తెచ్చి దళిత వర్గాలకు ఇస్తే.. మిగతా ప్రజలు అసంతృప్తికి గురవుతారు. పేదరికానికి కులం ఉండదు. అందుకే ప్రభుత్వ లబ్ది అందని ఇతర వర్గాలు అసంతృప్తికి గురవుతాయి. అప్పుడు అందరికీ రూ. పది లక్షలు పంపిణీ చేయడం అసాధ్యం. అప్పుడు కేసీఆర్ ఇతర వర్గాల వారికి కూడా సమాధానం చెప్పి వారిని సంతృప్తిపరచాల్సి వస్తుంది.
హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ‘దళిత బంధు’ పేరిట ఒక్కో దళితుడికి రూ.10 లక్షలిస్తానని కేసీఆర్ మాయ మాటలు చెబుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న మాట ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం కింద ప్రతిపాదించిన నగదుపై కూడా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ చెబుతున్నట్లు రూ.10 లక్షలకు ఇప్పుడు ఎకరా భూమి కూడా రాదని ఆయన అన్నారు. మూడెకరాల హామీ కింద రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందన్న సంజయ్.. ఉద్యోగాల హామీ, డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా చేర్చి ఐదు రెట్లు నిధులివ్వాలంటూ కేసీఆర్‌కి పంచ్ విసిరారు. మూడెకరాల భూమి కింద రూ.30 లక్షలు, డబుల్ బెడ్ రూం ఇంటికి రూ.10 లక్షలు, ఇప్పటికే ఉద్యోగం ఇచ్చి ఉంటే రూ.10 లక్షలు సంపాదించుకుని ఉండేవారని.. వాటన్నింటినీ కలిపి ఒక్కో దళిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
దళిత బంధు పథకంలో భాగంగా ఒక నిరుపేద కుటుంబం వ్యాపారం చేసుకోవడం కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని, ప్రతి నియోజకవర్గంలోనూ వంద కుటుంబాలకు సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక దళిత సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, వారి ఓటు బ్యాంకును ప్రతిపక్ష పార్టీలకు పడకుండా చేసేలా హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఈటలకు చెక్ పెట్టడానికేనని అందరికీ తెలుసు.
ఈటలను ఓడించటం కోసం ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ, మంత్రులను రంగంలోకి దించి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఎంత డబ్బైనా ఖర్చు చేయడం కోసం సిద్ధమవుతున్నారు. ఇక అక్కడ మిగతా సామాజిక వర్గాలకు ఏ తాయిలాలు ప్రకటిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.