కాలం కలిసొచ్చిందో, కాంగ్రెస్ కరుణించిందో తెలంగాణా రాష్ట్రం పుట్టినప్పటి నుంచీ కేసీయార్ కి తిరుగులేకుండా పోయింది.
ఉర్దూలో అనర్గళంగా మాట్లాడి సెక్యులర్ పలుకలతో ముస్లిముల మనసులు దోచుకుని వాళ్లకి కాంగ్రెస్ లేని లోటుని, తెలుగులో పద్యాలు చెప్పి ఇటు తెలుగు భాషాభిమానులకి తెలుగుదేశం లేని లోటుని, చండీయాగాలు గట్రా చేసి హిందుత్వవాదులకి బీజేపీ లేని లోటుని తీర్చేసి సర్వం తానైపోయి ఏకఛత్రాధిపత్యంగా ఏలేస్తున్నాడు కేసీయార్.
దానికి తోడు తనకంటే అన్ని విషయాల్లోనూ సమర్ధుడైన కొడుకు వారసుడిగా ఉండడం వల్ల ఆ పార్టీ కేడర్ మొత్తం నాయకత్వానికి దాసోహంగా పడి ఉంది. ఉన్నంతలో మరో సమర్ధుడైన ప్రజాబలం గల నాయకుడు హరీష్ రావు కారణంగా పార్టీలో చీలిక వస్తుందని ప్రతిపక్షాలు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నా ఆ తరుణం ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడంలేదు. వాళ్లంతా ఐక్యంగా బాగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో అసలు ప్రతిపక్షం ఉన్నా లేనట్టే అన్న చందంగా ఉంది ఇన్నేళ్లుగా. అయితే ఏ పార్టీకైనా ఆయువు పెంచేది, ఊపిరులూదేదీ మీడియానే.
తెలంగాణాలో ప్రధాన మీడియాలన్నీ కేసీయార్ అమ్ములపొదిలో చేరిపోయాయి. అయితే ఎప్పటి నుంచో తెలుగుదేశానికి వెన్నుదన్నుగా ఉన్న మీడియా సంస్థలకి మాత్రం తెలంగాణా ఆవిర్భావం జరిగినప్పటి నుంచీ కడుపులో మంట చల్లారడం లేదు. దానికి ప్రధాన కారణం ఒక్కటే.
ఇక్కడ తెలుగుదేశం నామరూపాల్లేకుండా పోవడం. పోనీ కేసీయార్ కి దాసోహమైపోయి ఆ పర్టీ పక్షాన ఉండాలంటే కులాభిమానం ఆ పని చెయ్యనీయదు. అలాగని ఎదురు తిరిగి ప్రతిపక్ష మీడియాగా శక్తి చాటుకుందామా అంటే ఇక్కడి తమ ఆస్తులు ఓ శుభముహూర్తాన ప్రభుత్వపరమైపోతాయేమో అని భయం. ఏలా చూసుకున్నా ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది తెలంగాణాలోని టీడీపీ మీడియా పరిస్థితి.
ఎనాళ్లనుంచో సరైన ప్రతిపక్ష నాయకుడి కోసం వేచి చూస్తున్న ఆ మీడియాకి ఆ మధ్య బండి సంజయ్ కనిపించాడు. కేసీయార్ పై అతను వ్యతిరేక స్వరం వినిపించినప్పుడల్లా పని కట్టుకుని ఆ మీడియా ప్రధాన శీర్షికల్లో అతన్ని కవర్ చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవగానే ఇక టీఆర్ఎస్ కోట బీటలు వారడం మొదలైందని టీడీపీ మీడియా నమ్మడం మొదలు పెట్టింది.
బండి సంజయ్ ని మరింత పెద్దగా చూపించింది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీయే జెండా ఎగరేసింది. సహజంగా ఏర్పడ్డ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీ కొన్ని సీట్లు గెలుచుకోగలిగింది తప్ప ఆ పార్టీకి బండి సంజయ్ వల్ల వచ్చిన వేవ్ ఏమీ లేదు. బీజీపీ ప్రభావం రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ బలాన్ని ఎదుర్కొనేంతగా అయితే కనపడలేదు.
ఇదిలా ఉండగా ఏపీ సీయం జగన్ సోదరి షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడానికి ముందుకొచ్చింది. ఆ సమయంలో టీడీపీ మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అన్నాచెల్లెళ్ల మధ్యలో సంబంధాలు చెడ్డాయని అటు జగన్ ఇమేజ్ పై బురదజల్లే ప్రయత్నం గట్టిగానే చేసింది. షర్మిలకి మద్దతిస్తే ఉభయకుశలోపరిగా అటు జగన్ కి మసి రాయడానికి, ఇటు కేసీయార్ పై “బాణం” సంధించడానికి బాగుంటుందని భావించింది ఆ మీడియా. అయితే షర్మిల పార్టీకి పెద్దగా స్పందన రాని కారణంగా ఆమెను పక్కన పెట్టింది.
ఆ తర్వాత తాజాగా రేవంత్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కగానే బండి సంజయ్ ని చంక దింపేసి రేవంత్ ని ఎత్తుకుంది టీడీపీ మీడియా. ఎందుకంటే రేవంత్ మనసా వాచా కర్మణా చంద్రబాబు మనిషి. కనుక తమ నాయకుడొచ్చాడు..కేసీయార్ కోటని బద్దలు కొడతాడు అని నమ్ముతోంది.
ప్రస్తుతానికి టీడీపీ మీడియా లక్ష్యం ఒక్కటే. ముందుగా రెండవస్థానంలో రేవంత్ ని సుస్థిరం చెయ్యాలి. దానికోసం షర్మిల పార్టీని, బీజీపీని జనం మరిచిపొయ్యేలా చెయ్యాలి.
అది జరిగాక రేవంత్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం అని నిరూపించాలి. తత్ఫలితంగా టీఆర్ఎస్ లో అణగదొక్కబడ్డ నాయకుల్ని (ముఖ్యంగా టీడీపీ నుంచి ఆ పార్టీ లోకి వెళ్లినవాళ్లని) బయటికి తీసుకొచ్చి కాంగ్రెసులో కలపాలి. వాళ్ల చేత కేసీయార్ పై తొడలు కొట్టించాలి.
అప్పట్లో చంద్రబాబుకి గాలికొట్టి లేపినట్టు ఇప్పుడు రేవంత్ ని క్రేన్లు పెట్టి పైకి లాగి టీఆర్ఎస్ ని పడగొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలి. ఎలాగో చంద్రబాబు కి రాహుల్ గాంధీతో సత్సంబంధాలున్నాయి కనుక రేవంత్ రాజ్యమొస్తే పరోక్షంగా తెలంగాణాలో చంద్రాబాబు రాజ్యమొచ్చినట్టే అని ప్రస్తుతానికి కళ్లు మూసుకునే కాకుండా కళ్లు తెరిచి కూడా టీడీపీ మీడియా కంటున్న సుందరస్వప్నం ఇది.
ఈ స్వప్నం నిజమవుతుందా? అన్ని పాచికలూ అనుకున్నట్టు పారతాయా? కాలమూ, ప్రజలే నిర్ణయించాలి.
– కాట్రగడ్డ ముక్తేశ్వర రావు