గెలుపు సంగతి తరువాత…బలమైన అభ్యర్థినైనా నిలబెడతారా?

ఎవరైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆలస్యం జరిగితే అదో అవకాశంగా ఉపయోగపడుతుంది. అది విజయంగా కూడా మారొచ్చు. కాంగ్రెస్ విషయంలో ఇదే జరుగుతుందేమోననిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాగా వెనక్కిపోయింది. పండుగలన్నీ అయిపోయాకే అంటే…

ఎవరైనా ఒక పని తలపెట్టినప్పుడు ఆలస్యం జరిగితే అదో అవకాశంగా ఉపయోగపడుతుంది. అది విజయంగా కూడా మారొచ్చు. కాంగ్రెస్ విషయంలో ఇదే జరుగుతుందేమోననిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాగా వెనక్కిపోయింది. పండుగలన్నీ అయిపోయాకే అంటే దీపావళి తరువాతే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం మొన్న ప్రకటించిన సంగతి తెలుసు కదా. 

కేంద్ర ఎన్నికల సంఘం తానంతట తాను ఈ నిర్ణయం తీసుకున్నదో, సీఎం కేసీఆర్ అభ్యర్థిస్తే తీసుకున్నాడో చెప్పలేంగానీ మొత్తం మీద ఉప ఎన్నిక వాయిదా వేసింది. ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా అప్పుడే జరుగుతుంది.

సరే …ఏదైతేనేం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీకి సమయం దొరికింది. టీఆరెస్, బీజేపీ ఆల్రెడీ అభ్యర్థులను రెడీ చేసేసింది. బీజేపీకి ఈటల రాజేందర్ రెడీమేడ్ అభ్యర్థి కదా. కొంత కసరత్తు తరువాత టీఆరెస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపికయ్యాడు. 

ఆయన ప్రచారం చేసుకోవలసిన అవసరం కూడా లేదు. ఆ కష్టమేదో కేసీఆర్, హరీష్ రావు, ఇతర మంత్రులు పడుతున్నారు. ఇక ఇప్పటివరకు అభ్యర్థిని తేల్చని పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. కొండా సురేఖను నిలబెట్టాలని రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్లికేషన్లను ఆహ్వానించి అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు నాయకులు.

 దాని గడువు కూడా ముగిసింది. 18 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వాటిని అధిష్టానానికి పంపించి ఉండొచ్చు. అభ్యర్థిని హై కమాండ్ ఎంపిక చేస్తుందన్న మాట. ఇలాంటి సమయంలో ఉప ఎన్నిక వెనక్కి పోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఇక్కడ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కావాలనే వ్యూహాత్మకంగా ఈ విషయంలో జాప్యం చేస్తోందా అనే ప్రచారం కూడా సాగుతోంది. 

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి అగ్నిపరీక్ష అవుతుందని  చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించకపోయినా.. గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తేనే రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందుకే ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇందుకోసం కొండా సురేఖను ఆయనే స్వయంగా మాట్లాడి ఒప్పించారు కూడా. కానీ ఆమె లోకల్ కాదని కొందరు సీనియర్ నాయకులు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ దగ్గర అభ్యంతరం చెప్పారు. దీంతో అప్లికేషన్లు ఆహ్వానించాలని నిర్ణయించి ఆ పని పూర్తి చేశారు. జరిగిన ఆలస్యాన్ని కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. గెలిచే సంగతి తరువాత ముందు గౌరవప్రదమైన ఓట్లు వస్తే అదే పదివేలు.