యూరప్ లో కరోనా కేసుల సెకెండ్ వేవ్ తో అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. యూకే పరిధిలో లాక్ డౌన్ ఆంక్షలను ప్రకటించారు. రానున్న నెల రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. ఇక కరోనా తొలి వేవ్ లో తీవ్ర భయాందోళనకు గురి అయిన ఇతర యూరప్ దేశాలు కూడా ఇప్పుడు్తన మళ్లీ లాక్ డౌన్ బాట పట్టాయి. ప్రజల స్వేచ్ఛాస్వతంత్రాలకు అపారమైన ప్రాధాన్యతను ఇచ్చే యూరోపియన్ దేశాలు, ఒత్తిడి చేసి అయినా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసేందుకు రెడీ అవుతున్నాయి.
వాస్తవానికి కరోనాను ఇప్పుడు యూరప్ దేశాలు చక్కగా ఎదుర్కొంటున్నాయి. కొత్తగా వస్తున్న కేసుల్లో మరణాల శాతాన్ని బాగా తగ్గించాయి అక్కడి వైద్యవ్యవస్థలు. తక్కువ జనాభా ఉన్న దేశాలు కావడం, వైద్యసౌకర్యాలు బాగా ఉండటంతో.. కొన్నాళ్లకు అయినా కరోనా రోగులకు మంచి సదుపాయాలను అందించి, వారిని కాపాడుకున్నాయి యూరోపియన్ దేశాలు.
ఈ విషయంలో భారతదేశంలోనూ కొన్ని రాష్ట్రాలు చక్కగా పని చేశాయి. కోవిడ్ సెంటర్లలో మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రం ప్రజారోగ్యానికి తన ప్రాధాన్యత ఎంతో చాటి చెప్పింది. అనుమానితులకు పరీక్షలు చేసి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా వ్యవహరించింది. దేశంలోని చాలా రాష్ట్రాలతో పోల్చినా ఏపీ చాలా మంచి సదుపాయాలను అందించింది. కరోనా టెస్టులను చేయడం విషయంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది కూడా.
అయితే అంతమాత్రానా.. ఇప్పుడు ఏపీకి కానీ, ఇండియా కానీ కరోనా నుంచి పూర్తిగా బయటపడినట్టు కాదని స్పష్టం అవుతోంది. అంతరాష్ట్ర ప్రయాణాలకు ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవు. ఈ నేపథ్యంలో.. ఏదో ఒక రాష్ట్రంలో జాగ్రత్త పడినా.. ఉపయోగం అంతంత మాత్రమే.
అనునిత్యం ప్రజలు రోమింగ్ లోనే ఉంటుండటంతో కోవిడ్ వ్యాప్తిని నిరోధించడం మాటలేమీ కాదు. ప్రత్యేకించి యూరప్ దేశాలు లాక్ డౌన్ ల వరకూ వెళ్లిన నేపథ్యంలో, ఇండియా కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నీ సౌకర్యాలూ ఉన్న యూరప్ లోనే లాక్ డౌన్ వరకూ వెళ్తున్నారంటే, అంతంతమాత్రం సౌకర్యాలున్న దేశంగా ఇండియా ఇప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.