తను ట్వీట్లు చేస్తేనే జగన్ ప్రభుత్వం భయపడిపోతోందని, అలాంటిది తను జనం మధ్యకు వస్తే ఇంకేం అయిపోతుందో.. అంటూ నారా లోకేష్ బాబు చెప్పుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది! .
ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల సమయంలోనూ ఇలా చెప్పుకుని, చెప్పుకునే.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ ఇలా చెప్పుకోవడం ప్రహసనంగా మారింది. ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా ఈ మాటలకేం తక్కువ లేదంటూ నారా లోకేష్ వీడియోల కింద కామెంట్లు తప్పేట్టుగా లేవు!
కనీసం ఎమ్మెల్యేగా నెగ్గి ఉంటే.. లోకేష్ ఇలాంటి మాట్లాడినా అదో ముచ్చట. అయితే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తను మంత్రి పదవిని వెలగబెడుతున్నప్పుడు.. ఏరి కోరి, అనేక సర్వేలు నిర్వహించి, ఎక్కడ విజయావకాశాలున్నయనే అంశం గురించి బోలెడన్ని అధ్యయనాలు చేయించి, చివరకు ఎంతో వడబోత అనంతరం మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేశారు. ఆయన బరిలోకి దిగడం వెనుక అంత కథ నడిచింది. అయితే అంత జేసినా.. ఎమ్మెల్యేగా మాత్రం లోకేష్ నెగ్గలేకపోయారు.
బహుశా ఒక రాజకీయ వారసుడికి అంతకు మించిన ఫెయిల్యూర్ లేదు. గతంలో ఇలాంటి అవమానాలు ఎదురైనా రాజకీయ వారసులు, ఆ అవమానాలను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుని రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయిన దాఖలాలున్నాయి. తమకు రాజకీయాలు వంటబట్టవు, తమకు ఆ ఛరిష్మా లేదని వారు తప్పుకున్నారు.
అయితే లోకేష్ మాత్రం.. అలాగే వేలాడుతున్నారు. తండ్రీ సీఎంగా ఉన్నప్పుడు, తను మంత్రిగా ఉన్నప్పుడు.. పచ్చమీడియా అలుపు లేకుండా పిల్లర్లు వేసినప్పుడు.. కూడా లోకేష్ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు. మామూలు వ్యక్తికి అది తీవ్ర అవమానం. అయితే చంద్రబాబు తనయుడు మాత్రం.. ఇంకా గప్పాలు కొట్టుకోవడం ఆపడం లేదు!
తన ట్వీట్లకే 151 సీట్లున్న ప్రభుత్వం భయపడిపోతోందట! ఇక తను జనాల్లోకి వస్తే ఇక జగన్ ప్రభుత్వం పరిస్థితి ఏమిటో అని లోకేష్ ముందే సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే లోకేష్ మంగళగిరి మాన్యాలు పట్టారు! అయినా.. ఆయన తీరు మాత్రం మారడం లేదు.
వేరే వాళ్లైతే అవమానాన్ని తట్టుకోలేక, మళ్లీ జనం ముందుకు రావడానికే ఆలోచనలో పడిపోయే వాళ్లు. అయితే చంద్రబాబు తనయుడు మాత్రం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా తన లేస్తే మనిషిని కాదంటూ చెప్పుకుంటున్నారు! మరీ ఇంత బేషరమ్ గానా లోకేష్ బాబూ! ఇలాంటి మాటలు మాట్లాడి తను మరింత కామెడీ అయిపోవడానికి కూడా ఆయన వెనుకాడుతున్నట్టుగా లేరు!