ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒకవేళ నిమ్మగడ్డ ప్రణాళికలు అన్నీ ఫలించి ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి వస్తే.. రాష్ట్రం మొత్తం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
స్థానిక ఎన్నికలంటే మాటలు కాదు.. లోక్ సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికల్లో పొలిటికల్ యాక్టివిటీస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. పంచాయతీ ఎన్నికల్లో అయితే ఏకంగా 90 నుంచి వంద శాతం వరకూ పోలింగ్ నమోదవుతుంది.
లోక్ సభ-అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదు కావడమే ఎక్కువ. అయితే లోకల్ బాడీస్ లో నేతలు దగ్గరుండి జనాలను పోలింగ్ బూత్ లకు తీసుకెళ్తారు. ప్రెసిడెంట్ పదవులకు పోటీ చేయడం ఏపీ వంటి రాష్ట్రంలో ఎంత ప్రతిష్టగా భావించే అంశమో వివరించనక్కర్లేదు.
ఇక పోలింగ్ సంగతలా ఉంచితే, ప్రచార పర్వంలో భాగంగా అభ్యర్థుల వెంబడి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో కార్యకర్తలు, వారి బంధుగణం వెళ్తారు. వీళ్లు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తారు. చిన్న చిన్న సందుల్లో కూడా వందల మంది కార్యకర్తలు దూరతారు.
పాంప్లేట్లు పంచడాలు, షేక్ హ్యాండ్లు ఇవ్వడాలు, ఆడవాళ్ల ప్రచారంలో పసుపూకుంకుమలు పంచడాలు, హారతులు ఇవ్వడాలు, దిష్టితీయడాలు.. ఇలా ఎన్నికల ప్రచారంలో జరగని హంగామా అంటూ ఉండదు. నేతల ఇళ్ల వద్దే భోజనాలు, అక్కడే విందు, అక్కడే ముందు.. ఇలా స్థానిక ఎన్నికల ప్రచార పర్వం ఒక పండగలా సాగే అవకాశాలున్నాయి.
ఏ జాతరలు కూడా పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వానికి సాటి రావు! ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగక తప్పదు! ర్యాలీలు నిర్వహిస్తారు, సభలు పెడతారు, వాటికి వంద మంరే రావాలి, రెండు వందల మందికి మించకూడదు.. అనే పరిస్థితి ఉండకపోవచ్చు! మంత్రులు, ఎమ్మెల్యేలు జనం లోకి వెళ్లినప్పుడు కార్యకర్తల హంగామా తీవ్రంగా ఉంటుంది.
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్యన సహజంగానే ప్రచార పర్వంలోనూ, ఈ సభలు, సమావేశాల్లోనూ పోటీ ఏర్పడుతుంది. ఒకరికి మించి మరొకరు వాటిని నిర్వహించాలని చూస్తారు.
ఇదంతా మామూలుగా జరిగితే ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ఇప్పటికీ ఏపీలో కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. రోజుకు మూడు వేల స్థాయిలో కేసులు వస్తున్నాయి.
మరోవైపు సెకెండ్ వేవ్.. అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు జరగాలంటూ తెలుగుదేశం పార్టీ ఉబలాటపడుతోంది. ఆ పార్టీ పాలిట పవిత్రగ్రంథం అయిన ఈనాడు పత్రికలో ఈ రోజు ఒక కథనం వచ్చింది. శ్రీనాథ్ రెడ్డి అనే వైద్య నిపుణులు ఈనాడుతో మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండకపోతే రెండో వేవ్ తప్పదని హెచ్చరించారు.
ఢిల్లీలో అదే జరుగుతోందని, యూరప్ లో వివిధ దేశాలు మళ్లీ లాక్ డౌన్ ను ప్రకటించడాన్ని ఆయన ఉదాహరించారు. రెండో వేవ్ ఎప్పుడు మొదలవుతుందంటే.. ప్రజలు జాగ్రత్తగా లేనప్పుడు, సమూహాలుగా ఏర్పడినప్పుడు అని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి కేసులు తగ్గిన చోట కూడా కనీసం ఆరు నెలల పాటు స్వీయ రక్షణ అవసరం అని ఆయన ప్రజలకు హితబోధ చేశారు!
మరి ఈనాడు పత్రికలో అలాంటి వ్యాసాలు వస్తున్నా.. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఎందుకు పట్టుబడుతున్నట్టు? ఎంత ఎన్నికల కమిషనర్ అయితే మాత్రం రాష్ట్రం మొత్తాన్నీ ప్రమాదంలోకి నెట్టే హక్కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏమున్నట్టు?.
తనతో కలవడానికి నలుగురు వస్తే.. వారిలో ఒక్కోరిని ఒక్కోసారి రావాలంటూ పదినిమిషాల గడువులను ఇచ్చిన ఆయన.. ఎన్నికల నిర్వహణకు ఎలా ముందుకు వెళ్తున్నట్టు? నిమ్మగడ్డే కాదు… ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చినా.. సదరు వ్యవస్థలు రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్టే నని నిపుణుల అభిప్రాయాలను బట్టి స్పష్టం అవుతోంది.