ప్రతిపక్షాల్లో ప్రతి పార్టీ అధికారపక్షానికి తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం సాధారణమే. ప్రతిపక్షాలు చాలా ఉన్నా అధికార పార్టీని ఢీకొట్టే సత్తా ఉన్న పార్టీ, తరువాతి ఎన్నికల్లో అధికారానికి రాగల సామర్థ్యం ఉన్న పార్టీ ఏదో ఒకటే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే చర్చ సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కొద్దిగా డౌన్ అయినా దాని సత్తా తగ్గలేదు. డీలా పడలేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను కూడా దాంతోపాటే నిర్వహిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపినట్లుగానే జీహెచ్ఎంసీకి కూడా జరిపి ప్రతిపక్షాలను లేవకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ జోరు మీద ఉంది. ఇందుకు కారణం లోక్‌సభ ఎన్నికల్లో ఊహించనివిధంగా నాలుగు స్థానాలను గెలుచుకోవడమే. ఆ పార్టీకి అమితమైన సంతోషం కలిగించిన మరో విషయం ఏమిటంటే గులాబీ దళపతి కుమార్తె కవితను, ఆయనకు కుడిభుజంవంటివాడైన వినోద్ కుమార్‌ను ఓడించడం. కేంద్రంలో గతంలో కంటే భారీ మెజారిటీతో గెలిచి మోదీ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. దీంతో బలమైన శక్తిగా బీజేపీ అవతరించిందని ఆ పార్టీ నేతలు అదేపనిగా ఊదరగొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కాషాయం పార్టీదేనని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో పార్టీని గద్దె దింపగల సత్తా బీజేపీకే ఉందంటున్నారు. ఇక పార్టీని బలోపేతం చేసే పని కూడా బీజేపీ నేతలు ప్రారంభించారు. బలోపేతం చేయడమంటే ఇతర పార్టీల్లోని నాయకులను లాక్కోవడం. దీన్నే 'ఆపరేషన్ ఆకర్ష్' అంటున్నాం.
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ బీజేపీలో చేరిపోయినట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈయన కుమారుడు అరవింద్ నిజామాబాద్‌లో కవితను భారీ మెజారిటీతో ఓడించాడు. లోక్‌సభ ఎన్నికలకు ముందు డీఎస్‌కు వ్యతిరేకంగా కవిత గళం విప్పడంతో రేగిన చిచ్చు కేసీఆర్-డీఎస్ మధ్య దూరం పెంచింది. ఆయన్ని పార్టీ నుంచి వెళ్లగొడతారేమోనని అనుకున్నారుగాని కేసీఆర్ రాజకీయపరమైన లెక్కలేసుకొని ఆ పని చేయలేదు. డీఎస్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడటంతో ఆ పార్టీలో చేరడం ఖాయమైందంటున్నారు. ఆయన మరికొందరు టీఆర్ఎస్, కాంగ్రెసు నాయకులను తీసుకుపోతారట. ఇక కాంగ్రెసు పార్టీని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తయారుచేయాల్సిన నాయకులు తమలో తామే కొట్టుకుంటున్నారు. దీంతో 'తెలంగాణ ఇచ్చింది మేమే..తెచ్చింది మేమే' అని ఎంతగా గుండెలు బాదుకుంటున్నా ప్రయోజనం లేకుండా ఉంది.
కేసీఆర్‌ను గద్దె దింపుతామని మధ్యమధ్యలో కొందరు నేతలు హూంకరిస్తుంటారు. కాని ఆ తరువాత ఒకవేళ కాంగ్రెసు అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలనే దానిపై కొట్టుకుంటారు. వీరిదంతా 'ఆలూ లేదు..చూలూ లేదు..కొడుకు పేరు సోమలింగం' సామెత టైపు. 'నన్ను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే కాంగ్రెసును అధికారంలోకి తెస్తా' అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఆయన సోదరుడు పార్టీ నేతలపై ఆరోపణలు చేసి తాను బీజేపీలోకి వెళతానని సంకేతాలు ఇచ్చాడు. దీంతో కలకలం రేగి క్రమశిక్షణ చర్యలు తీసుకునేవరకూ వెళ్లింది. కాని ఇప్పుడు మళ్లీ కాంగ్రెసులోనే ఉంటానని అంటున్నాడట. ఇలాంటి లుకలుకల కారణంగా కాంగ్రెసు పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతుందని ఎవ్వరూ అనుకోవడంలేదు.
ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ జిగ్రీదోస్తు, ఇప్పుడు శత్రవు అయిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ 'రాష్ట్రంలో భవిష్యత్తు మాదే' అని తాజాగా సెలవిచ్చారు. భవిష్యత్తు అంటే అధికారమనే అర్థం కదా. టీజెఎస్ ఇక ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, 'నీ దారి నీదే సాగిపోరా' అన్నట్లుగా సాగిపోతామని అన్నారు. ఇప్పటివరకు ఈ పార్టీ ట్రాకు రికార్డు చూస్తే ఇది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతుందనుకోవడానికి ఆస్కారం లేదు. కోదండరామ్ తప్ప ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు లేరు. రాష్ట్రంలో టీడీపీ అధ్యాయం ముగిసింది. ఏపీలో బాబు గెలిచివుంటే కొంత ఉత్సాహంగా ఉండేదేమో. తెలంగాణలోని అన్ని మునిసిపాలిటీల్లో టీడీపీ పోటీ చేయాలని ఈమధ్య చెప్పిన బాబు తాజాగా 'బలమున్న చోట్లలోనే పోటీ చేయాలి' అని నేతలకు చెప్పారు. ఆ పార్టీకి ఎంత బలముందో ఆయనకే తెలియాలి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే పార్టీలు మునిసిపల్ ఎన్నికల్లో ఎంత సత్తా చాటుతాయో చూడాలి.