ఏపీలో భారీ మెజార్టీతో గెలిచి ఒకరకంగా కేంద్రానికి షాకిచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ సర్కారుకి ఒకింత కంటగింపే. సందర్భం ఎప్పుడొచ్చినా ప్రత్యేకహోదా పేరుతో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న జగన్ ఢిల్లీలోని పెద్ద తలకాయలందరికీ తలనొప్పిగా మారారు. అదే సమయంలో రాష్ట్రంతో సఖ్యత కొనసాగిస్తూనే జగన్ సర్కారుపై తన పెత్తనం చూపించాలనుకుంటోంది కేంద్రం. దీనికి తాజా ఉదాహరణే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మన సీఎం జగన్ కు రాసిన లేఖ.
సంప్రదాయేతర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల రద్దు విషయంలో అంతదూకుడు పనికిరాదని, అలాచేస్తే దేశానికి రావాల్సిన పెట్టుబడులు తగ్గిపోతాయని, ఒకరకంగా ఇది అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేననేది ఈ లేఖ సారాంశం. అయితే నేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేసుకోవద్దు అని ఆదేశాలివ్వడానికి కేంద్రం భయపడింది. అందుకే ఓసారి పునరాలోచించండి అంటూ మెత్తగా మాట్లాడింది.
ఇంతకీ ఈ ఒప్పందాలు రద్దు చేసుకుంటే కేంద్రానికి వచ్చే నష్టం ఏంటి? అసలు ఈ అవినీతి కుంభకోణంలో కేంద్రం వాటా ఎంత? అప్పటి టీడీపీ సర్కారు వాటా ఎంత? ఇవే ఇప్పుడు తేలాల్సిన విషయాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జగన్ ప్రసంగాన్ని విన్నవారంతా ఆయన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను ఎందుకు ప్రస్తావించారా అని ఆశ్చర్యపోయారు. ఆ చీకటి కుంభకోణాన్ని బైటపెట్టి అవినీతికి అడ్డుకట్ట వేస్తానని ప్రమాణ స్వీకారం రోజునే ప్రజలకు మాటిచ్చారు జగన్.
ఒకటా, రెండా, ప్రత్యామ్నాయ విద్యుత్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నవన్నీ చీకటి ఒప్పందాలే. నీకెంత, నాకెంత అంటూ కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని వృథాగా విదేశీ కంపెనీలకు ధారపోశారు. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సింది పోయి, సంప్రదాయేతర విద్యుత్ అంటూ దుబారా ఖర్చు చేశారు. దీనికి కేంద్రం కూడా వంత పాడటం వల్లే గత టీడీపీ ప్రభుత్వం ఆడిన ఆటలన్నీ చెల్లుబాటు అయ్యాయి.
అంత ఖర్చుపెట్టి విద్యుత్ కొనడం అవసరమా అని ప్రతిపక్షం ఎన్నిసార్లు మొత్తుకున్నా.. అభివృద్ధి కంటకులు అంటూ నిందవేసి తమ తప్పు కప్పి పుచ్చుకోవాలని చూశారు. తీరా జగన్ అధికారంలోకి వచ్చన తర్వాత వీటిపై ఎంక్వయిరీ మొదలైంది. వేలకోట్ల రూపాయల దుబారాని వెనువెంటనే ఆపేయాలని నిర్ణయానికి వచ్చిన సీఎం జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నిటినీ సమీక్షించాలని, అవకతవకలుంటే వెంటనే రద్దు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆ క్రమంలో జగన్ తీసుకున్న కఠిన నిర్ణయాలు కేంద్రానికి కంటగింపుగా మారాయి.
ఒకరకంగా ఈ విషయంలో కేంద్రం పెత్తనం ఇక్కడ పనిచేయడం లేదు. ఒప్పందాలు రద్దయితే విదేశీ కంపెనీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. లాలూచీ వ్యవహారం రచ్చకెక్కే అవకాశం కూడా ఉంది. అందుకే పరిస్థితి అంతదూరం రాకూడదని బీజేపీ సర్కారు జగన్ కి సలహాల రూపంలో లేఖలు రాస్తోంది. అయితే జగన్ ఈ విషయంలో కాస్త గట్టిగానే ఉన్నారని సమాచారం. కేంద్రం ఒత్తిడి తెచ్చినా ప్రజలకు అన్యాయం చేయలేమని, ఒప్పందాల రద్దుకే సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారట. ఈ విద్యుత్ ఒప్పందాల సమీక్షలు ఎవరికి షాక్ ఇవ్వబోతున్నాయో త్వరలోనే తేలిపోతుంది.