అమరావతిలో ‘రియల్’ బతుకులేంటో ‘ఈనాడు’ అక్షర రూపం ఇచ్చింది. ‘రాజధాని ప్రాంతంలో ఉద్యమం కృత్రమమైంది. అది కేవలం కొందరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రేరేపిత ఉద్యమం’ అని అధికార వైసీపీతో పాటు కొన్ని ప్రజాసంఘాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈనాడులో శనివారం ‘ధర’ణి ఆశలు ఆవిరి’ అనే శీర్షికతో బ్యానర్‌గా ప్రచురించిన వార్తా కథనం ప్రచురితమైంది.
అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు రెండు మెతుకులు పట్టుకుని చూస్తే సరిపోతుందంటారు. అలాగే అమరావతిలో ఆందోళనలు ఎందుకోసం, ఎవరి కోసం? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈనాడు కథనం అంతా చదవాల్సిన పనిలేకుండా…ఆ కథనం సబ్ హెడ్డింగ్స్ చదివితే చాలు.
అమరావతి చుట్టూ భారీగా తగ్గిన భూముల ధరలు; 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో పతనం; మూగబోయిన మాగాణి ; 3 రాజధానుల ప్రకటనతో వేల కోట్ల నష్టం…ఇవి సబ్ హెడ్డింగ్స్.
‘ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా వావులూరు/గని ఆత్కూరులో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవసాయ భూములను ఎకరా రూ.75 లక్షల నుంచి రూ.1.30 కోట్లు చెల్లించి ఐదెకరాలకు పైగా కొనుగోలు చేసింది. అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.40 లక్షల వరకు ఇచ్చారు. ఒప్పందం మేరకు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన గడువు ముగిసింది. ఇప్పుడు బయట అమ్ముకోవాలన్నా అడిగే వారు లేరు’…ఇది ఈనాడు కథనంలోని ముఖ్యాంశం.
అంటే రియల్ ఎస్టేట్ సంస్థ లాభాల కోసమేనా వామపక్షాలు ఉద్యమించేది? రియల్ ఎస్టేట్ ఉద్యమానికి మద్దతుగా చంద్రబాబు సతీమణి తన రెండు బంగారు గాజులు విరాళం కింద ఇచ్చింది? రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమేనా బాబు జోలెపట్టి ఊరూరా తిరుగుతూ భిక్షాటన చేసేది? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏడుపులు, పెడబొబ్బలు రియల్టర్ల కోసమా, రైతుల కోసమా?
‘రాజధాని ప్రాంత బృహత్ ప్రణాళిక ప్రకటించాక చుట్టూ 30 నుంచి 40 కి.మీ పరిధిలో భూమి ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు పలికింది. వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు వారి భూములను కొన్నారు. తమ భూములు ఎప్పుడైనా మంచి ధరలు పలుకుతాయని ఆశించిన రైతులంతా ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు’
రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర పెట్టి వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు భూములు కొన్నారని ఒకవైపు ఈనాడు స్పష్టంగా చెబుతూనే, ఆ తర్వాతే వాక్యం తమ భూములు ఎప్పుడైనా మంచి ధరలు పలుకుతాయని ఆశించిన రైతులంతా ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
రైతుల సెంటిమెంట్ సాకుగా చూపి జగన్ సర్కార్‌ను టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా బ్లాక్మెయిల్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కట్టుకథలు రాస్తూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం. ఎకరా రూ.60 లక్షలు మొదలుకుని రూ.కోటి వరకు మంచి ధర అనే భావనతో రైతులు అమ్ముకున్నారు. ఇక తీవ్ర నిరాశ ఎవరికి? ఈనాడు దృష్టిలో ఏ రైతుల గురించి? వ్యాపారులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు రైతులవుతారా? వారి తీవ్ర నిరాశ రైతులది ఎలా అవుతుందో ఈనాడు రామోజీరావు చెప్పగలరా?
‘రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి ఛిన్నాభిన్నమైంది. వేలకోట్ల సంపద ఆవిరైంది. బాహ్య వలయ రహదారికి సమీపంలో , ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రాజధానుల గురించి డిసెంబర్ 17న ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రస్తావించే వరకు ఎకరా రూ.30 లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.15 లక్షలు , రూ.10 లక్షలకు తగ్గిపోయాయి’
ఈనాడు కథనాన్ని బట్టి…2014లో రాజధాని ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి ఎంత ధర ఉందో…గత డిసెంబర్ 17న ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన తర్వాత….తిరిగి పాత ధరకే పడిపోయాయి. భూమి ధర తగ్గితే ఒకరికి పది మంది చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒకరిద్దరి చేతుల్లోనే మొత్తం భూమి పెట్టుకుని, రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా లాభాలు గడించి ఒకరిద్దర్ని మాత్రమే ధనవంతులు చేయాలని ఎందుకనుకోవాలి?
మూడు రాజధానుల ప్రకటన తర్వాత కర్నూలు, విశాఖలలో భూముల ధరలను కూడా రాస్తే బాగుంటుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అదే కదా. ‘మనం బాగుండాలి, అందరూ బాగుండాలనేదే’ సీఎం ఆకాంక్ష. ఇప్పుడదే కదా జరుగుతున్నది.