పాదయాత్రకు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్న అమరావతి ఉద్యమకారులు.. ఇప్పుడు తిరుపతిలో తాము సభ పెట్టుకోవాలని కోర్టును ఆశ్రయించారు. సభకు ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ సభను అడ్డుకుంటోందని ఆరోపిస్తూ వీరు కోర్టుకు ఎక్కారు.
వాస్తవానికి పాదయాత్రకు కూడా కోర్టు షరతులతోనే అనుమతిని ఇచ్చింది. ఈ ప్రాంతీయ అభిమానపు పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం చెప్పినా, కోర్టు అనుమతిని ఇచ్చింది. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అప్పుడు తాము సభ పెట్టుకుంటామని అమరావతి ఉద్యమకారులు కోర్టును కూడా కోరలేదు!
పాదయాత్ర సమయంలో ఒట్టి పాదయాత్రకు పర్మిషన్ కోరారు. సభ ఊసు లేదప్పుడు. అయితే ఇప్పుడు తిరుపతిలో సభ నిర్వహించాలని వారికి అనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో.. మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఆదిలోనే సభకు పర్మిషన్ కోరి ఉంటే.. బహుశా పాదయాత్రకే పర్మిషన్ వచ్చేదేమో! అయితే అమరావతి బ్యాచ్ చాలా వ్యూహాత్మకంగా కోర్టు తలుపు తడుతోందని స్పష్టం అవుతోంది. మరి ఈ పిటిషన్ రేపు విచారణకు రానుందట. కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
ఇక రాయలసీమ మేధావుల ఫోరమ్ తరఫున కూడా తిరుపతిలో సభకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోరారు. అయితే దానికి కూడా ప్రభుత్వం నిరాకరించింది. మరి రాయలసీమ ఉద్యమకారులు కూడా తమ సభ కోసం కోర్టును ఆశ్రయించడానికి ఇదే తగిన తరుణం లాగుంది.