ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతోంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు హైకోర్టు లేదా పరిపాలన రాజధాని కేటాయించాలి. కానీ రాయలసీమకే చెందిన చంద్రబాబునాయుడు తన ప్రాంతవాసుల ఆకాంక్షలను లెక్కచేయలేదు. తన సామాజిక వర్గం తప్ప సమాజ ప్రయోజనాల ఏ మాత్రం పట్టవనే రీతిలో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారు.
రాయలసీమకు కనీసం హైకోర్టు అయినా ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజానీకం ఎంత వేడుకున్నా ఆయన మనసు కరగలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు. మరీ ముఖ్యంగా రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం మూడంటే మూడే స్థానాలకు టీడీపీని పరిమితం చేశారు. దీన్ని బట్టి తమ ప్రాంతానికి ద్రోహం చేసిన చంద్రబాబుపై సీమ సమాజం ఎంతగా కోపంతో రగిలిపోతున్నదో అర్థం చేసుకోవచ్చు.
గోరుచుట్టుపై రోకటిపోటు అనే చందంగా అసలే అన్యాయానికి గురయ్యామనే ఆవేదనతో ఉన్న రాయలసీమ ప్రజానీకాన్ని టీడీపీ నేతృత్వంలో మహాపాదయాత్రగా వస్తున్న వాళ్లు రెచ్చగొట్టే చర్యలకు దిగారు.
రాయలసీమ నడిబొడ్డు తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటుకు యత్నిస్తున్నారు. తిరుపతిలో బహిరంగ సభ పెట్టి, మీ ప్రాంతానికి ఏమీ వద్దు, అన్నీ మాకే కావాలి, ఏం చేస్తారో చేసుకోండి అని రెచ్చగొడతారట! వీరికి వంత పాడేందుకు ప్రజాదరణ లేని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.
ఇదే సందర్భంలో తమకు జరిగిన అన్యాయాన్ని లోకానికి చాటి చెప్పేందుకు ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటుకు ఆ ప్రాంత ఉద్యమకారుడు మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అదే రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు అనుమతి అడిగిందని, తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు, కరోనా మహమ్మారి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని సీమ ఉద్యమకారుల సభ ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పోలీసుల అనుమతి నిరాకరణపై సీమ ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఎలాగైనా సభ నిర్వహించి తమ గోడు వినిపించాలని సీమ ఉద్యమకారులు పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితిలో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి నేతృత్వంలో సిద్ధమైనట్టు సమాచారం.
బహుశా మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఒకే రోజు వేర్వేరు ప్రాంతీయ సంస్థల బహిరంగ సభలకు అనుమతి ఇవ్వడంపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందోననే ఉత్కంఠ నెలకుంది.