రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక ఎన్నికల్లో ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావడానికిగానీ ఓడిపోవడానికిగానూ అనేక కారణాలు ఉంటాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టీడీపీ మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రెండోసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ చేతిలో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
టీడీపీ అసలు ఇక కోలుకోదని ప్రచారం జరిగింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీని వైఎస్ జగన్ చావుదెబ్బ కొట్టాడని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే చంద్రబాబు కూడా చాలా కాలం విషాదంలో ఉండిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దిగజారిపోయిందని, ఆర్ధికంగా పాతాళానికి పోయిందని ప్రచారం జరుగుతోంది.
ఇది పూర్తిగా అవాస్తవమని చెప్పలేం. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల మీదనే దృష్టి పెట్టి అభివృద్ధిని మరచిపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయి అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని టీడీపీ, దాని అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి.
ఈ ప్రచారం జనానికి ఎంతవరకు ఎక్కిందో తెలియదుగానీ ఈమధ్య ఒక సంస్థ చేసిన సర్వేలో వైసీపీకి ప్రజాదరణ కొద్దిగా మాత్రమే తగ్గిందని తేలిందట. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకే అధికారం దక్కే అవకాశం ఉండవచ్చని ఆ సర్వే చెప్పింది.
అయితే ఈ రెండున్నరేళ్లలో టీడీపీ కూడా బాగానే పుంజుకుందని ఆ సర్వేలో బయట పడిందట. అధికారానికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చుగానీ వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చినంత బండ మెజారిటీ రాకుండా టీడీపీ అడ్డుకుంటుందని ఆ సర్వే స్పష్టం చేసిందట. ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది కాబట్టి ఈ సర్వేలో చెప్పినట్లే జరుగుతుందా అంటే కచ్చితంగా చెప్పలేం.
పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. టీడీపీ పుంజుకోవచ్చు. కానీ ఎంతమేరకు దాని బలం పెరిగిందో చెప్పలేం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఏయే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఎన్నికల ముందు జరిగే సర్వేలతోనే పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు.