ఆర్కే చేసిన నేరం ఏంటి?

ఇది ముమ్మాటికీ పాడు కాలం వేమూరి రాధాకృష్ణ (ఆర్కే). లేక‌పోతే ఏంటి? టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడ‌గ‌కుండానే అండ‌గా నిలుస్తూ వ‌స్తున్న ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కేకు…. తాజా ప‌రిస్థితులు రివ‌ర్స్ అయ్యాయి.  Advertisement ఆర్కేకి…

ఇది ముమ్మాటికీ పాడు కాలం వేమూరి రాధాకృష్ణ (ఆర్కే). లేక‌పోతే ఏంటి? టీడీపీ అధినేత చంద్ర‌బాబు అడ‌గ‌కుండానే అండ‌గా నిలుస్తూ వ‌స్తున్న ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కేకు…. తాజా ప‌రిస్థితులు రివ‌ర్స్ అయ్యాయి. 

ఆర్కేకి చంద్ర‌బాబు అండ‌గా నిల‌వాల్సి వ‌చ్చింది. ఏం కాదులే అని ఆర్కేకి ధైర్యం చెప్పాల్సిన ప‌రిస్థితి. అయితే త‌న డిక్ష‌న‌రీలో భ‌యం అనే ప‌దమే లేద‌ని ఆర్కే చెబుతార‌నుకోండి, అదే వేరే విష‌యం. కానీ తామంతా మీ వెన‌కే ఉన్నామ‌ని ఆర్కేపై సానుభూతి వెల్లువెత్తుతోంది.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మినారాయణకు ధైర్యం చెప్ప‌డానికి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. 

త‌న‌కు ఆప్త‌మిత్రుడు కావ‌డంతో వెళ్లి, సీఐడీ అధికారుల ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల్సిందిగా చెప్పి వ‌చ్చాన‌ని ఆర్కే వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే త‌మ విధుల‌కు ఆటంకం క‌లిగించారంటూ ఆర్కేపై సీఐడీ అధికారులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

అస‌లే అభిమానుల్లో ఆర్కేకు చంద్ర‌బాబు హృద‌యంలో ప్ర‌త్యేక స్థానం. చంద్ర‌బాబును వెన‌కేసుకు రావ‌డంలో ఆర్కే త‌ర్వాతే ఎవ‌రైనా. చంద్ర‌బాబు అంటే అంత భ‌క్తి, ప్రేమ‌, అభిమానం, వాత్స‌ల్యం…ఇలా ఏ పేరైనా పెట్టుకోవ‌చ్చు. 

అలాంటి మీడియా య‌జ‌మాని అయిన అభిమానికి క‌ష్ట‌మొస్తే… చంద్ర‌బాబు త‌న‌కెందుకులే అని ఊరుకుంటారా? అబ్బే, ప్ర‌శ్నే లేదు. ఆర్కేపై సీఐడీ అధికారుల కేసును ఖండిస్తూ చంద్ర‌బాబు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆర్కే చేసిన త‌ప్పేంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.

‘దాదాపు 30 గంటల తర్వాత  జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు సంకెళ్లు ఎన్నాళ్లు వేస్తారు?. వేమూరి రాధాకృష్ణ ఏం నేరం చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 

తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా?. లక్ష్మినారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు?. 

తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారు. వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ సీఐడి అధికారులు, సంస్ధ పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని మంటగలుపుతున్నారు’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.