'పౌరసత్వ చట్టం సవరణలు పూర్తయ్యాయి… ఇక దేశమంతా ఎన్ఆర్సీనే..' అంటూ ప్రకటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెనక్కు తగ్గారు. లోక్ సభలో ఆ ప్రకటన చేసిన అమిత్ షా… ఇప్పుడు ఎన్ఆర్సీ విషయంలో స్పందించారు. ప్రధానమంత్రి మోడీ ఇటీవల మాట్లాడుతూ..ఎన్ఆర్సీని గురించి ఇంకా చర్చించలేదని వ్యాఖ్యానించారు.
'ఎన్ఆర్సీ గురించి లోక్ సభలో కానీ, కేబినెట్లో కానీ చర్చించలేదు.. 'అని అంటూ మోడీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు అమిత్ షా చేసిన ప్రకటన కు భిన్నంగా మాట్లాడారు మోడీ. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎద్దేవా చేయసాగాయి. అమిత్ షా ఒకటి చెబితే, మోడీ మరోటి చెబుతున్నారంటూ.. విమర్శించాయి. ఈ నేపథ్యంలో షా మరోసారి స్పందించారు.
మోడీ చెప్పింది నిజమే అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ గురించి ఇంకా ఎలాంటి చర్చా జరగలేదు అంటూ.. మోడీ వ్యాఖ్యలనే తిప్పి చెప్పారు షా. అయితే ఎన్పీఆర్ మాత్రం యథాతథంగా సాగుతుందన్నారు. ఇది జనాభా గణాంకాల వ్యవహారం. ప్రతి పదేళ్లకూ ఒకసారి దేశ వ్యాప్తంగా జనాభా గణాంకాలు సాగుతూ ఉంటాయి కదా, అదే ఈ ఎన్పీఆర్. అందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి స్పష్టత ఇచ్చారు.
మరో రెండేళ్లలో జనాభా లెక్కలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం అందుకు సంబంధించి నిధుల కేటాయింపు కూడా జరిగింది. జనాభా లెక్కల్లో కేవలం కుటుంబాల జనసంఖ్యను మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని.. ఆధార్, బయోమెట్రిక్ వివరాలు ఏవీ ఇవ్వనక్కర్లేదని కేంద్రం చెబుతూ ఉంది.