ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 24! ఇదీ చంద్రబాబు మార్కు పొత్తు ధర్మం! మరి ఈ సీట్ల సంఖ్య జనసేన స్థాయికి ఎక్కువా? తక్కువా? అంటే.. రెండు సమాధానాలూ వినిపిస్తాయి!
పవన్ కల్యాణ్ తన గురించి తాను చెప్పుకునే దానికి ఈ 24 సీట్లు అనేవి అణుమాత్రంతో సమానం కాదు! ప్రజారాజ్యం పార్టీని పెట్టి చిరంజీవి సొంతంగా 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పార్టీని గెలిపించుకోగలిగాడు! మరి చిరంజీవి వెంట నిలిచిందనుకున్న కాపు సామాజికవర్గం మొత్తం తన వెనుక ఉందనుకుంటున్న పవన్ కల్యాణ్ పోటీకే 24 అసెంబ్లీ నియోజకవర్గాలను సంపాదించుకోగలిగాడు!
చిరంజీవి అభిమానవర్గం, పవన్ కల్యాణ్ అభిమానవర్గం, కాపు సామాజికవర్గం.. ఇన్నింటిని తాకట్టు పెట్టి కేవలం 24 అసెంబ్లీ సీట్లలో పోటీకి అనుమతి పొందడం అనేది అత్యంత పేలవమైన రాజకీయ వ్యూహం! ఇది ఎవరో చెప్పేది కాదు.. కాపు సామాజికవర్గం పెద్దలే తేల్చి చెప్పారు!
కనీసం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీతో పొత్తు కుదుర్చుకోవాలని, అప్పుడే ఓట్ల బదిలీ జరుగుతుందని కాపు పెద్దలు పవన్ కు పూసగుచ్చినట్టుగా చెప్పారు! బహిరంగ లేఖలు రాశారు. పవన్ కల్యాణ్ తమకు దొరకడం లేదని, అందుకే బహిరంగ లేఖలు రాయాల్సి వస్తోందని వారు వాపోయారు! మరి వారి మాటలు వినడానికే పవన్ కు ఆసక్తి లేకపోయింది. అలాంటిది వారు కోరినట్టుగా 60 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎలా లభిస్తాయి!
ఓవరాల్ గా ఈ 24 సీట్ల ఒప్పందం ద్వారా పవన్ కల్యాణ్ తన స్థాయిని తనే తగ్గించి వేసుకున్నారు! ఇందులో ఏమాత్రం అనుమానం లేదు! పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత కూడా పొత్తుకు వెళ్లడం, అంతని ఇంతని 24 సీట్లకు పరిమితం కావడం పవన్ కల్యాణ్ తన రాజకీయ స్థాయిని చాలా వరకూ తగ్గించేసుకున్నట్టే! కాపు పెద్దలు చెప్పినట్టుగా ఈ 24 సీట్లతో రాష్ట్రమంతా జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి బదిలీ అయ్యే అవకాశాలు అయితే లేనట్టే! అలా ఉంది ఈ పొత్తు ఒడంబడిక!
ఇక ఇదే సమయంలో జనసేనకు ఈ 24 సీట్లు కేటాయించడం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది! పవన్ స్థాయికి ఏ పదో 15 సీట్లతో సరిపెట్టకుండా ఈ 24 వరకూ తీసుకురావడం ఏమిటనేది తెలుగుదేశం పార్టీలో రగులుతున్న చిచ్చు! ఇప్పుడు జనసేనకు కేటాయించిన ఈ 24 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు, ఇన్ చార్జిలున్నారు, క్యాడర్ ఉంది! ఉన్నఫలంగా ఇప్పుడు వారు బ్యాక్ సీట్లోకి వెళ్లి వేరే వాళ్ల డ్రైవింగ్ లో నడవాలంటే .. వారు అసంతృప్తికి గురవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు! జనసేనకు కేటాయించిన సీట్లలో తెలుగుదేశం పార్టీ లొల్లి తప్పేలా లేదు.
జనసేనకు టీడీపీ క్యాడర్ సహకరించే అవకాశాలు కూడా ఉండవు! అసలు 24 నియోజకవర్గాల్లో పోటీ అవకాశాన్ని కేటాయిస్తే.. అందులో కేవలం ఐదు చోట్లే అభ్యర్థులను టక్కున ప్రకటించుకోగల సత్తా చూపిన పవన్ కు అన్ని నియోజకవర్గాలను కేటాయించడం కూడా ఎక్కువే అని తటస్తులు కూడా గొణుక్కునే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు!