జనసేన వీరాభిమాన వర్గానికి గట్టి ఝలక్ తగిలింది. తమ అభిమాన సినిమా హీరో సీఎం అవుతారనేంత స్థాయిలో అడావుడి చేసే జనసైనికులకు పొత్తులో తేలిన సీట్ల లెక్కతో ఫ్యూజులు ఎగిరిపోయాయి! చాలామంది నమ్ముతారో నమ్మరో కానీ.. తెలుగుదేశం, జనసేన పొత్తుతో పవన్ కల్యాణ్ సీఎం అవుతారని నమ్మిన వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు!
జనసేన కల్ట్ చూపిస్తాం.. అనే బ్యాచ్ కు తమ వీరాభిమాన నేతకు దత్తతండ్రి ఇచ్చిన పర్మిషన్ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి మాత్రమే అనేది అర్థమయ్యాకా తిండి కూడా సయించని పరిస్థితి ఏర్పడింది!
తెలుగుదేశం పార్టీని తామే పైకి లేపుతున్నామని పవన్ కల్యాణ్ కూడా ప్రకటించుకున్నారు! మరి పైకే లేపే వాళ్లకు మరీ ఇంత తక్కువ స్థాయి సీట్లేమిటనేది కూడా గందరగోళమే! పొత్తులో భాగంగా జనసేనకు కనీసం అరవై డెబ్బై నియోజకవర్గాలైనా దక్కాలనేది, దక్కుతాయనేది వీరాభిమానులు వేసుకున్న లెక్క! అయితే అందులో మూడో వంతు సీట్లలో కూడా జనసేన అభ్యర్థులు నిలబడే పరిస్థితి లేదిప్పుడు!
సినిమా తెరపై పవన్ ను హీరో పాత్రల్లో చూసి ఉప్పొంగిన బ్యాచ్చే జనసేన కు కూడా మద్దతుగా నిలుస్తోంది. ఆన్ లైన్లో అయినా, ఆఫ్ లైన్లో అయినా పవన్ ను పాలిటిక్స్ లో కూడా హీరోగా భావించిన వారే మద్దతుగా నిలిచారు! అయితే సినిమాల్లో హీరో ఎప్పుడైనా సోలోగా తేల్చుకుంటాడు, నైతికతకు కట్టుబడతాడు, వారితో వీరితో చేతులు కలిపి ప్రత్యర్థులను ఎదుర్కోడు!
ఎవరైనా వెంట వస్తామన్నా.. వారిని వారించి, తనే వెళ్లి సోలోగా తేల్చుకుని విజయం సాధిస్తాడు! ఇది పవన్ కల్యాణ్ సినిమాల్లో కూడా కనిపించే ఫార్ములానే ! అందుకే పవన్ సినిమాలు హిట్. హీరోగా పవన్ అంటే ఆరాధన! మరి రాజకీయాల్లో .. పవన్ కల్యాణ్ అలాంటి హీరోయిజం ఏదీ చూపించడం లేదు! వ్యూహాలు, గోల.. ఇవన్నీ ఫ్యాన్స్ కు పడేవి కావు. తమ హీరో ఎలా ఉంటాడో వారికంటూ ఒక పిక్చర్ ఉంది. పవన్ తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
మరి ఇది మల్టీస్టారర్ సినిమా ..అని పవన్ కల్యాణ్ అభిమానులు అనుకోవాలన్నా.. మల్టీస్టారర్ సినిమాలో ఇద్దరి హీరోలకూ సమప్రాధాన్యతను ఆశించడంలో వింత లేదు! సమప్రాధాన్యత కాదు కదా, కనీసం పావు వంతు ప్రాధాన్యత కూడా పవన్ కు దక్కలేదు చంద్రబాబు సినిమాలో! 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 అంటే ఇది మరీ తీసికట్టు! రాజకీయ వ్యూహాలు, లెక్కలు ఏవైనా.. మరీ తమ హీరో ఇంతలా చీప్ అయిపోవడం పవన్ కల్యాణ్ అభిమానులు జీర్ణించుకునే అంశం కాదు! రేపటి నుంచి ప్రత్యర్థులు గేలి చేస్తే తట్టుకోవడం ఎలాగో మరి!