చంద్రబాబు-పవన్ కలిసి ప్రకటించిన అభ్యర్ధుల జాబితా అనకాపల్లి నియోజక వర్గంలో చిచ్చు రాజేసింది. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారని, అందులోనూ కొణతాల రామకృష్ణకు ఇచ్చారని తెలియడంతో తెలుగుదేశం జనాలు ఆగ్రహావేశాలు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి కొడతా అని పవన్ అన్నపుడు ఇదే కొణతాల కాంగ్రెస్ మంత్రిగా వున్నారు. ఇప్పుడు తన అన్న కోసం ఏరి కోరి కొణతాలను పార్టీలోకి తెచ్చుకున్నారు పవన్.
కొద్ది రోజుల కిందటే కొణతాల ఇంటికి వెళ్లి, ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా అని చెప్పినట్లు వార్తలు వచ్చినా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఎంపీ, ఎమ్మెల్యే రెండూ జనసేనకు ఇచ్చేస్తారా అని లెక్కలు కట్టారు. పైగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు గట్టి ఆశతో గత అయిదేళ్లు గా పార్టీ కోసం పని చేసుకంటూ వస్తున్నారు.
మరోపక్క ఇటీవలై వైకాపా నుంచి వచ్చిన దాడి వీరభద్రరావు వుండనే వన్నారు. వీరిని కాదని కొణతాలకు ఇవ్వడం కొంచెం ఆశ్చర్య కరమే. కులాల ఈక్వేషన్లు సరిపోయాయి. ఎమ్మెల్యేగా గవర కుల అభ్యర్ధి, ఎంపీ గా కాపు కుల అభ్యర్థి.
కానీ కొణతాల గత అయిదారేళ్లుగా ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు రాజకీయాలకు దూరంగా వున్నారు. ఇటీవల లోకేష్ వచ్చినపుడు కూడా కలవలెేదు. పూర్తిగా రాజకీయంగా అచేతనంగా వుంటూ వస్తున్నారు. కేవలం బంధువు కనుక పీలా గోవింద్ తప్పని సరిగా సహకరిస్తారు అన్నది తెలుగుదేశం ఆలోచన కావచ్చు. కానీ వైకాపా అభ్యర్థితో పోల్చుకుంటే డబ్బు పరంగా కొణతాల ఖర్చు చేయడం కాస్త కష్టమే. పైగా జనసేన నుంచి ఏ మేరకు ఆర్థిక మద్దతు లభిస్తుంది అన్నది చూడాలి.
కానీ ఈ రోజే తెలుగుదేశం కేడర్ నిరాశ పడిపోయింది. ఇటీవల లోకేష్ వచ్చినపుడైతేనేమీ, వివిధ కార్యక్రమాల కోసం అయితేనేమీ గ్రామాల్లో కట్టిన ఫ్లెక్సీలను తీసేసి తమ నిరసన తెలియచేసారు. చాలా మంది తెలుగుదేశం లోకల్ లీడర్లను కదిలిస్తే, వైకాపా కేండిడేట్ అదృష్టం అని మొహం మీద చెబుతున్నారు.
మొత్తం మీద టికెట్‌ల పంపిణీ వ్యవహారం రాజేసిన అసంతృప్తి జ్వాలను ఎల్లో మీడియా సైట్లు, పత్రికలు దాచేస్తే దాచేయవచ్చు కానీ గ్రవుండ్ లెవెల్ లో మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగానే మారుతోంది.