వైసీపీలో తెర‌మ‌రుగు నేత‌లు తెర‌పైకి!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లూ తెర‌మ‌రుగు అయిన ప‌లువురు నేత‌లు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం! ఈ జాబితాలో ఒక‌ప్పుడు కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లూ తెర‌మ‌రుగు అయిన ప‌లువురు నేత‌లు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం! ఈ జాబితాలో ఒక‌ప్పుడు కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్లు, ఆ త‌ర్వాత రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను కోల్పోయిన వారు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్నారు. అలాంటి వారిలో కొంద‌రి పేర్లు మ‌ళ్లీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో కూడా అధిష్టానం పరిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుందనే టాక్ న‌డుస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఈ జాబితాలో పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రిద్ద‌రు, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రు, పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రు, ఇంకా క‌దిరిలో ఒక‌రిద్ద‌రు నేత‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నారు! వీరు పార్టీతో ఏదో ర‌కంగా దీర్ఘ‌కాల సంబంధాలు క‌లిగిన వారే. అయితే రాజ‌కీయంగా ఇన్నాళ్లూ వీళ్ల‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేదు. ఇప్పుడు పార్టీ స‌మావేశాలు, క్యాడ‌ర్ తో వీరు క‌ల‌వ‌డాలు జ‌రుగుతున్నాయి. ఇది రాజ‌కీయంగా ఆస‌క్తిని రేపుతూ ఉంది.

పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన సోమ‌శేఖ‌ర రెడ్డి కొన్నాళ్లుగా పార్టీ క్యాడ‌ర్ తో క‌లుస్తూ ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఆహ్వానాలు అందిన పెళ్లిళ్ల‌ల‌కు వెళ్లి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దిస్తూ వ‌స్తున్నారు. ఎమ్మెల్యేకు ఎన్ని పెళ్లిళ్ల ఆహ్వానాలు అందుతున్నాయో.. సోమ‌శేఖ‌ర రెడ్డి కి కూడా అనే వెడ్డింగ్ ఇన్విటేష‌న్ కార్డులు అందుతూ ఉంటాయి. ఎమ్మెల్యే కూడా పార్టీ క్యాడ‌ర్ ఇంటి పెళ్లిళ్ల‌కు వెళ్లిన‌ట్టుగానే, సోమ‌శేఖ‌ర రెడ్డి కూడా వాటికి హాజ‌ర‌వుతూ ఉన్నారు!

ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ ఎమ్మెల్యే పాముదుర్తి ర‌వీంద్రారెడ్డి త‌న‌యుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా మారారు. పుట్ట‌ప‌ర్తి సంగ‌త‌లా ఉంటే.. క‌దిరిలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక‌ప్ప‌టి మంత్రి ఒక‌రు తెర‌పైకి వ‌స్తున్నారు. ఆయ‌న‌తో పాటు ఒక‌రిద్ద‌రు ఆశావ‌హ నేత‌లుకూడా తమ ప్ర‌య‌త్నాలు తాము చేసుకుంటూ ఉన్నారు.

అలాగే పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ఆఫీసును ప్రారంభించుకున్నారు సానె ఉమారాణి. ఈ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే సానె చెన్నారెడ్డి కూతురు ఈమె. హ‌త్య‌ల‌కు గురైన ఓబుళ రెడ్డి, ర‌మ‌ణారెడ్డిల సోద‌రి. పార్టీలో చాలా కాలంగా స‌భ్య‌త్వాన్ని అయితే ఆమె క‌లిగి ఉన్నారు. అడ‌పాద‌డ‌పా క‌నిపించేవారు. ఇప్పుడు పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె కార్య‌క‌లాపాలు సాగుతూ ఉన్నాయి. ఆర్థికంగా ప‌వ‌ర్ లేక‌పోయినా.. ఆమె ప్ర‌య‌త్నాలు ఆమె చేసుకుంటూ ఉన్నారు.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. సూరి భార్య భానుమ‌తి రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం పార్టీ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం మ‌రో విశేషం. 2004లో భానుమ‌తి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా ప‌రిటాల ర‌విపై పోటీ చేశారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఆమెకు అవ‌కాశం ద‌క్క‌లేదు. ర‌వి హ‌త్య జ‌రిగిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక‌ల్లో ఫ్యాక్ష‌న్ నేప‌థ్యం ఉన్న కుటుంబాల‌ను దూరం పెడుతున్నామ‌ని ప్ర‌క‌టించింది. భానుమ‌తికి టికెట్ ఆ త‌ర్వాత ద‌క్క‌లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం త‌ర్వాత తోపుదుర్తి కుటుంబం రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జి స్థానాన్ని ఆక్ర‌మించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో భానుమ‌తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత ఆమె యాక్టివ్ గా లేరు. ఇప్పుడు ఉన్న‌ట్టుండి ఆమె నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆస‌క్తి దాయ‌కం!

ఒక నియోజ‌క‌వ‌ర్గం అని కాకుండా.. ఇలా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున గ‌తంలో పోటీ చేసిన వారు, రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న వారు హ‌ల్చ‌ల్ చేస్తూ ఉన్నారు!