ఏపీ నో నీడ్‌ బాబు!

స‌ర్వ రోగాల‌తో బాధ‌ప‌డుతూ, ఇంటి నుంచి బ‌య‌టికి క‌దిలితే అంబులెన్స్ అవ‌స‌ర‌మ‌య్యే చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కుడిగా ప‌నికొస్తారా? అని ప్ర‌శ్నిస్తే… ప‌నికి రార‌ని పౌర స‌మాజం నిన‌దిస్తోంది. ఒక‌టా, రెండా…పైకి చెప్పేవి కొన్నైతే, చెప్పుకోలేని…

స‌ర్వ రోగాల‌తో బాధ‌ప‌డుతూ, ఇంటి నుంచి బ‌య‌టికి క‌దిలితే అంబులెన్స్ అవ‌స‌ర‌మ‌య్యే చంద్ర‌బాబునాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాల‌కుడిగా ప‌నికొస్తారా? అని ప్ర‌శ్నిస్తే… ప‌నికి రార‌ని పౌర స‌మాజం నిన‌దిస్తోంది. ఒక‌టా, రెండా…పైకి చెప్పేవి కొన్నైతే, చెప్పుకోలేని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో చంద్ర‌బాబు బాధ‌ప‌డుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు ఆవేద‌న‌తో చెబుతున్నాయి. ఏదైనా ఉద్యోగానికి వెళితే ఆరోగ్య సంబంధంగా ప‌రీక్షించి…అన్‌ఫిట్ అని తేలితే రిజెక్ట్ చేస్తారు.

అలాంటిది ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల‌ని , అది కూడా 73 ఏళ్ల‌కు పైబ‌డి వృద్ధాప్యంతోనూ, మాన‌సిక , శారీర‌క స‌మ‌స్య‌ల‌తో నిద్ర‌లేని రాత్రులు గడుపుతున్న చంద్ర‌బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అవ‌స‌రం లేద‌నే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. చంద్ర‌బాబు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో అల్లాడుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు చెప్ప‌డం లేదు. స్వ‌యంగా చంద్ర‌బాబు లాయ‌ర్లే న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లిన నేప‌థ్యంలో, ఆయ‌న అనారోగ్యానికి సంబంధించి అధికారికంగా చెప్పిన‌ట్టైంది.

స్కిల్ స్కామ్‌లో అరెస్ట‌యిన చంద్ర‌బాబునాయుడికి న్యాయ స్థానం మాన‌వ‌తా దృక్ప‌థంతో మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 7న చంద్ర‌బాబుకు హైద‌రాబాద్‌లో ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రిలో నేత్ర చికిత్స చేశారు. ప్ర‌స్తుతం బాబు ఇంట్లోనే వుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నెల 28న మ‌ధ్యంత‌ర బెయిల్ గడువు ముగియ‌నుంది.

ఈ లోపు బాబు అనారోగ్యానికి సంబంధించి కొత్త సమ‌స్య‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా గుండె సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు బాబు న్యాయ‌వాదులు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. గుండె సైజు పెరిగిందని, అలాగే రక్తం సరఫరా చేసే నాళాల్లో సమస్యలు ఉన్నాయని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చర్మ సంబంధిత ఎలర్జీ పెరిగిందని వైద్యులు చెప్పారు. మ‌రో మూడు నెలలపాటు గుండె, చర్మ సంబంధిత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వుండాల‌నేది వారి సూచ‌న‌గా న్యాయ‌స్థానానికి తెలియ‌జేశారు. అలాగే చంద్ర‌బాబు ఎక్కడికి వెళ్లినా అంబులెన్స్‌ వెంట ఉంచుకోవాలని వైద్యులు సూచించిన‌ట్టు లాయ‌ర్లు చెప్పారు.

కంటి చుక్కలు ఐదు వారాలపాటు, యాంటీ బయాటిక్‌ చుక్కల మందు 2 వారాలపాటు వాడాలని వైద్యులు తెలిపిన‌ట్టు లాయ‌ర్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ప‌దికాలాల పాటు జీవించాల‌నేది అంద‌రి కోరిక‌. అయితే పొగ తాగ‌డం ఆరోగ్యానికి ఎంత హానిక‌ర‌మో, ప్ర‌స్తుతం క‌లుషిత‌మైన  రాజ‌కీయాలు ఆరోగ్యానికి అంత‌కంటే ఎక్కువ ప్ర‌మాద‌క‌రం. ఆరోగ్యంగా బాగున్న రాజ‌కీయ నేతలే మురికి కూప‌మైన ఆ రంగం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా? అని ఆలోచిస్తున్నారు.

కావున చంద్ర‌బాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయ‌న శాశ్వ‌తంగా ఇంటిప‌ట్టునే విశ్రాంతి తీసుకోవ‌డం మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏడు ప‌దుల‌కు పైబ‌డిన వ‌య‌సులో, అందులోనూ దేశంలోని రోగాల‌న్నీ త‌న‌లోనే పెట్టుకుని బాధ‌ప‌డుతున్న చంద్ర‌బాబును తామే ప‌క్క‌న పెట్ట‌క‌ముందే, ఆయ‌నే దూరంగా వుండ‌డం మంచిద‌ని పౌర స‌మాజం చెబుతోంది. చంద్ర‌బాబు గారూ…నాలుగు ద‌శాబ్దాల‌కు పైబ‌డి మీదైన ముద్ర రాజ‌కీయాల్లో వేశారు. ఇక మీ ఆరోగ్యంతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని, జైలుకే కాదు, రాజ‌కీయాల‌కు దూరంగా వుండ‌డం ఉత్త‌మ‌మైన ప‌ని అనే హిత‌వును త‌లకెక్కించుకుంటే మంచిదనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది.