రాజకీయ నాయకుల మాటలు.. చాలా సందర్భాల్లో చిత్రంగా ధ్వనిస్తుంటాయి! ‘నువ్వు అవినీతికి పాల్పడ్డావు’ అని ఎవరైనా విమర్శిస్తే, వారి సమాధానం దానికి సూటిగా ఉండనే ఉండదు. ‘మీరు అవినీతికి పాల్పడలేదా’ అనే జవాబు మాత్రమే వస్తుంది. తెలుగుదేశం అయినా, వైయస్సార్ కాంగ్రెస్ అయినా.. ఇలాంటి పరిస్థితుల్లో తేడా ఏమీ ఉండదు. ఏ పార్టీ వాళ్లయినా అలాగే మాట్లాడుతుంటారు.
వైసిపి అవినీతిని నిందిస్తే.. గతంలో తెలుగుదేశం చేయలేదా.. అంటారు! తెలుగుదేశం తప్పులు చేసింది కాబట్టే కదా.. ప్రజలు తిప్పికొట్టారు! అయినా తెలుగుదేశం అవినీతికి పాల్పడితే, వారిని ఆదర్శంగా భావించకూడదు కదా. ఇలాంటి ఎదురుదాడి రాజకీయం కాకుండా తమ స్వచ్ఛతను సచ్ఛీలతని మాత్రమే చెప్పుకునే రాజకీయం ఉండాలని ప్రజలు కోరుకుంటారు!
తాజాగా తన గురించి రేగుతున్న వివాదం విషయంలో, ఇలాంటి ఎదురుదాడి రాజకీయమే గోరంట్ల మాధవ్ కూడా చేస్తున్నారు. ఆయన న్యూడ్ వీడియో విషయంలో అత్యంత హేయమైన రీతిలో కులాన్ని తెరమీదకు తెచ్చిన మాధవ్ ఎదురుదాడి రాజకీయానికి వెనుకాడడం లేదు. నిజానికి మాధవ్ ఎపిసోడ్ బయటకు వచ్చిన తొలి రోజు నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఫోన్ కాల్ రికార్డింగ్ ను ప్రస్తావిస్తున్నారు. అది నిజమేనా కాదా అని అడుగుతున్నారు.
తాజాగా గోరంట్ల మాధవ్ ఇదే విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ.. ఓటుకు నోటు కేసులో బయటకు వచ్చిన తన ఆడియో కాల్ రికార్డింగ్ ఫేక్ అని చంద్రబాబు నాయుడు గనుక ప్రమాణం చేస్తే, తన మీద విడుదలైన న్యూడ్ వీడియో ఫేక్ అని తాను కూడా కాణిపాకంలో ప్రమాణం చేస్తానని అంటున్నారు. నిజానికి ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు దిగజారుడుతనం గురించి వైసిపి నాయకులు కొత్తగా ఆరోపించవలసిన అవసరం ఏమాత్రం లేదు!
చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసినా చేయకపోయినా కోర్టులు ఒకవేళ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా ప్రజలు మాత్రం ఆ కాల్ రికార్డింగ్ ను నమ్ముతున్నారు. లోపాయికారీ రాజకీయ బేరసారాలకు పెట్టింది పేరైన చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ ఓటు కొనుగోలు చేయడానికి మాట్లాడిన మాటలను ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు తన క్రెడిబిలిటీని, ఒకవేళ అలాంటిది ఉండి ఉంటే, దానిని ఎప్పుడో కోల్పోయారు!!
అలా తెర మరుగైపోయిన వ్యవహారం గురించి, గోరంట్ల మాధవ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రస్తావించడం ఎందుకు? చంద్రబాబు ప్రమాణం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. గోరంట్ల మాధవ్ కు గనుక తన చిత్తశుద్ధిని, శీలాన్ని ప్రజల ఎదుట నిరూపించుకోవాలని ఉంటే ఆయన స్వయంగా కాణిపాకం లో న్యూడ్ వీడియో గురించి ప్రమాణం చేసి విమర్శకుల నోరు మూయించవచ్చు.
జిల్లా ఎస్పీ ఫకీరప్పగానీ, సిబిఐ చీఫ్ సునీల్ కుమార్ గానీ తమ తమ ప్రకటనలతో గోరంట్ల మాధవ్ వీడియో నిజమేనా కాదా అనే సందేహాన్ని తటస్థులైన ప్రజల మెదడులలోకి కూడా చొప్పించారు.
గోరంట్ల మాధవ్ పోలీసుల మాటలని చాకచక్యంగా కొంత వక్రీకరించి తన సచ్చీలత గురించి, తన సత్యసంధత గురించి ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి బదులు చంద్రబాబుతో ముడిపెట్టకుండా కాణిపాకంలో తానే ప్రమాణం చేసేస్తే, తన గౌరవాన్ని పెంచుకున్నట్లు అవుతుంది కదా.. చంద్రబాబును మరింతగా పిరికివాడుగా దోషిగా నిందించే అవకాశం దక్కుతుంది కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు!