ఆయన గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. రోజులు వికటించిన తర్వాత.. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కూడా కేబినెట్ హోదాలోనే ఉన్నారు. వీటన్నింటినీ మించి.. ఆయన తనను హత్య చేసేస్తారని భయపడుతున్నారు. వాళ్లే మహాత్మా గాంధీని చంపేశారని.. వాళ్లు తనని వదలిపెట్టరని, తనను కూడా చంపేస్తారని అంటున్నారు. తద్వారా.. ఆయన తనను తాను మహాత్మాగాంధీతో సమానంగా, మహానుభావుడిగా తనను తాను ప్రొజెక్టు చేసుకోవడానికి తపన పడుతున్నారో ఏమో అర్థం కావడం లేదు. ఆయన మరెవ్వరో కాదు.. కన్నడ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య!
సిద్ధరామయ్య ఇటీవలి వరదల నేపథ్యంలో కొడుగు ప్రాంతంలో పర్యటించడానికి వెళ్తే.. ఆయనకు ప్రజల నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఆయన కాన్వాయ్ ను అడ్డుకుని నల్లజెండాలుచూపించారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆయన కారు మీద కోడిగుడ్లు కూడా విసిరారు. ఇలాంటి పరిణామం జరిగినప్పుడు.. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఇలా చేయించిందని అధికారి పార్టీ అనడం, అధికార బిజెపి కార్యకర్తలే ఇలా చేశారని కాంగ్రెస్ ఆరోపించడం మామూలే.
కానీ.. సిద్ధరామయ్య ఒక అడుగు ముందుకు వేసి.. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఒక విశేషం. అంతటితో ఆగకుండా.. మహాత్ముడిని హత్య చేసిన వాళ్లు తనను కూడా విడిచిపెట్టరని, గాంధీతో పోల్చుకోవడం ఇంకా చోద్యం.
సిద్ధరామయ్యకు ఎదురైన చేదు అనుభవం, బిజెపి ప్రేరేపిత వ్యతిరేకత మాత్రమే అయిఉండొచ్చు గానీ.. అలాగని ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని అనుకోవడానికి కూడా వీల్లేదు. కానీ.. తన కాన్వాయ్ కు నల్లజెండాల నిరసన తగలడం, కోడిగుడ్లు విసిరినంతనే సిద్ధరామయ్య హత్య- మహాత్మాగాంధీ వంటి ఓవరాక్షన్ డైలాగులు వేయడమే హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటిదాకా కన్నడ రాజకీయాల్లో కోడిగుడ్లు విసరడం ద్వారా.. ఎందరు నాయకుల హత్యలు జరిగాయ్ అని ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.
మహాత్ముడిని రచ్చలోకి లాగి.. మహాత్ముడిలాగానే తనను చంపేస్తారని అనడం ఇంకా పెద్ద తమాషా! కానీ ఈ వాక్యాల ద్వారా.. మహాత్ముడి హత్యను, ఆ హత్యతో భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందనే ఆరోపణల్ని సిద్ధరామయ్య మరోసారి తిరగతోడారు. మోడీ వ్యతిరేక శక్తులు చాలామంది.. ప్రస్తుతం ఆయనను, ‘మహాత్మా గాంధీ వ్యతిరేకత గల నాయకుడిగా’ చూపించడానికి తపన పడుతున్నారు. హత్య ప్రస్తావన తేకపోయినా.. ఈ తరహా ఆరోపణలు కేసీఆర్ కూడా చాలా చేస్తుంటారు.
సిద్ధరామయ్య కూడా.. గాంధీ వ్యతిరేకిగా మోడీ మీద ముద్ర వేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.