మహాత్మాగాంధీ… ఈ పేరు కేవలం మన దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఒక స్ఫూర్తి. గాంధీజీ స్వాతంత్ర్య పోరాట మార్గం ఓ ఉత్తేజం, ఉద్వేగం. ఆయన ఆచరించిన జీవిత మార్గం నేటి తరానికీ ఎంతో అవసరం అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భావించారు. గాంధీజీ జీవితం గురించి నేటి తరానికి తెలియజేయడానికి తన వంతు ప్రయత్నంగా ఆ మహ నీయుడి ఆత్మకథ “సత్యశోధన”ను పునఃముద్రించారు. ఈ పుస్తకావిష్కరణ సభకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఎల్లో మీడియా రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం ఆ మహనీయుడిపై గౌరవంతోనైనా బరి తెగించరని ఎవరైనా అనుకుంటారు. కానీ జగన్ అనే నాయకుడిని బద్నాం చేయడానికి మహనీయుల్ని కూడా విడిచిపెట్టరనే సంగతి ఇప్పుడే తెలిసొచ్చింది. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పరోక్షంగా కరుణాకరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారని రాయడం పచ్చపత్రికకే చెల్లింది.
పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించిన చందంగా, జగన్‌ను వ్యతిరేకించే తమకు ఎవరేం మాట్లాడినా ముఖ్యమంత్రిని వ్యతిరేకించినట్టుగానే అనిపించడం గమనార్హం. “పతనమైన వ్యక్తికి అధికారమిస్తే చేసేదేముంది” అనే శీర్షికతో గాంధీజీ ఆత్మకథ పుస్తకావిష్కరణ సభకు ఆంధ్రజ్యోతి ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించింది. ప్రస్తుతం అధికారంలో జగన్ ఉండడంతో ఆయన గురించే సొంత పార్టీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారనే సందేశాన్ని తీసుకెళ్లడం సదరు పత్రిక దురుద్దేశమని అర్థం చేసుకోవచ్చు. ఈ సభ ముఖ్య అతిథి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడిన అంశాల్ని లీడ్ తీసుకోకుండా, కరుణాకరరెడ్డి ప్రసంగాన్ని హైలైట్ చేయడం వెనుక పచ్చ పత్రిక మోటీవ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆ పత్రిక ఏం రాసిందంటే..
‘నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని, పతనం చెందిన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆయన ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారనేది చర్చనీయాంశంగా మారింది’
ఆ సభలో కరుణాకరరెడ్డి వాస్తవంగా ఏమన్నారంటే…
‘ఆధ్యాత్మికతను నైతికతతో బంధించి రాజకీయాలను కొనసాగించిన మహనీయుడు, మానవతా పురుషుడు, మహర్షి మహాత్ముడు. నైతికతలేని రాజకీయాలు ప్రమాదకరమని, పతనం చెందిన మానవుడికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదని, ప్రకృతిలో సంపద కావాల్సినంత ఉందని, కానీ మానవుడి అత్యాశే మింగేస్తుందని, మనం సంపదకు కాపలాదారులమే తప్ప హక్కుదారులం కాదని ఒక గొప్ప నిర్వచనం ఇచ్చిన మహాపురుషుడు మహాత్ముడు. గాంధీని నినాదాలకు మాత్రమే వాడుకుని ఆయన ఆచరణని మరిచిపోవడం అన్నది ఈ తరం చేస్తున్న పాపం అని నా భావన’
రాజకీయాలు, ప్రకృతి సంపదపై గాంధీజీ అభిప్రాయాల్ని మాత్రమే తిరుపతి ఎమ్మెల్యే చెప్పారు. కానీ ఎల్లో మీడియా మాత్రం వాటిని తిరుపతి ఎమ్మెల్యే అభిప్రాయాలుగా, అవి కూడా తమ నాయకుడిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన ఘాటు వ్యాఖ్యలుగా వక్రీకరించడం గమనార్హం. చివరికి జగన్‌పై రాజకీయ దాడి కోసం గాంధీజీని కూడా వాడుకునేంతగా పచ్చ పత్రిక దిగజారిందా? అని ఆశ్చర్యం కగలకమానదు. మన పత్రికలు పెట్టుబడిదారులకు పుట్టిన విషపుత్రికలని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. వాటి విశృంఖలత్వాన్ని ఇవాళ కళ్లారా చూడాల్సి రావడం సమాజ దౌర్భాగ్యం.