పార్టీ నిర్ణయంపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఏకంగా అర్ధరాత్రి నిరసనకు దిగారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అధిష్టానం నియమించింది. ఈ నియామకం తాడికొండ నియోజకవర్గ వైసీపీలో రచ్చకు దారి తీసింది. ఉండవల్లి శ్రీదేవిపై నియోజకవర్గంలోని సొంత పార్టీలో కొంత కాలంగా తీవ్ర అసంతృప్తి నెలకుంది.
ఈ నేపథ్యంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించడం సరికొత్త వివాదానికి దారి తీసింది. ఈ నియామకం ఉండవల్లికి చెక్ పెట్టడమే అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తాడికొండ టికెట్‌ను ఆశించే నాయకుల సంఖ్య పెరుగుతోంది. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితర నాయకులు తాడికొండ టికెట్‌ను ఆశిస్తున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా పని చేశారు.
ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. ఎమ్మెల్సీగా ఉంటే మంత్రి పదవి దక్కదనే ఆవేదన ఆయనలో ఉంది. దీంతో ఎమ్మెల్యే అయితే …తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందొచ్చే ఆశ ఆయనలో ఉంది. మరోవైపు ఉండవల్లి శ్రీదేవి వ్యతిరేకులను బాగా పెంచుకున్నారు. నోటి దురుసుతో ముఖ్య నాయకుల్ని కూడా దూరం చేసుకున్నారనే వాదన ఉంది.
దీంతో తిరిగి ఆమెనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపితే నష్టపోతామనే భావన వైసీపీ అధిష్టానం మనసులో ఉంది. సౌమ్యుడిగా పేరున్న డొక్కాకు తాడికొండ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. ఆయనే సరైన అభ్యర్థిగా భావించడం వల్లే పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే క్రమంలో నియామకం చేపట్టారనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో డొక్కా నియామకంపై శ్రీదేవి, ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి సుచరిత ఇంటి ఎదుట శ్రీదేవి నేతృత్వంలో నిరసనకు దిగారు. వెంటనే డొక్కా నియామకాన్ని రద్దు చేయాలని అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారు. మాణిక్యవరప్రసాద్ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి అనుచరులు మండిపడ్డారు. అధిష్టానంతో చర్చిస్తానని హామీ ఇవ్వడంతో అర్ధరాత్రి ఆందోళన విరమించారు. ఈ రచ్చ వైసీపీలో చర్చకు దారి తీసింది.