సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలుసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులై స్వస్థలానికి వచ్చిన సందర్భంలోనూ ఎన్వీ రమణ దంపతులను జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు.
గతంలో ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, పలువురు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని ఏకంగా సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం విధితమే. దీంతో న్యాయ వ్యవస్థతో జగన్ ఢీకొంటున్నారనే ప్రచారానికి తెరలేచింది.
ఇలా అనేక విషయాలు న్యాయ వ్యవస్థ, ఏపీ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఉందనే ప్రచారానికి బలం కలిగించాయి. అయితే కొంత కాలంగా అంతా కూల్‌గా సాగిపోతోంది. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించేందుకు ఎన్వీ రమణ వచ్చారు.
సీఎం జగన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రతో కూడా కొత్త భవనాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికంటే ముందుగా నోవాటెల్ హోటల్లో బస చేసిన ఎన్వీ రమణను జగన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.