మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పోటీల్లోకి దించడానికి గులాబీ దళపతి కేసీఆర్ ఫిక్స్ అయిపోయినట్లు సమాచారం! కూసుకుంట్లకు అభ్యర్థిత్వం ఇస్తే ఆయనను ఓడించడానికే తామంతా పని చేస్తామని ఆ నియోజకవర్గంలోని తెరాస నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంతగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, హెచ్చరిస్తున్నప్పటికీ కేసీఆర్ వాటిని ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఇప్పటిదాకా చేయలేదు.. అంతే తప్ప ఆ పార్టీలో సంకేతాలు అన్నీ కూడా ఆ నిర్ణయం ఖరారైనట్లే సూచిస్తున్నాయి!
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇదివరలో టిఆర్ఎస్ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా ప్రబలంగా ఉన్నప్పటికీ ఆయన ఓడిపోయారు. పార్టీ నాయకులు కొందరు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ఓడిపోయారని ప్రచారం జరిగింది. ఆ సానుభూతితోనే ఇప్పుడు మళ్లీ టికెట్ ఇవ్వాలనుకున్నారో ఏమో గానీ.. గెలిచినప్పుడు కూడా ఆయన భారీ మెజారిటీ సాధించింది ఏమీ లేదు!
2018 ఎన్నికల తర్వాత ఇవాళ్టి వరకు నియోజకవర్గంలో తానంటే గిట్టని నాయకులతో సయోధ్యగా మెలిగింది కూడా లేదు. వారిని తనకు అనుకూలంగా మార్చుకున్నది కూడా లేదు. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కెసిఆర్ మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ ఇచ్చి తీరాలని ఎందుకు అనుకుంటున్నారో.. అటు పార్టీలో గాని, ఇటు ప్రజల్లో గాని ఎవ్వరికీ అర్థం కావడం లేదు!
ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో హైదరాబాదులో కాసేపు సమావేశమైన కేసీఆర్.. మునుగోడు టికెట్ ఎవరికీ ఇచ్చినా అందరూ కలిసి పని చేయాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. కూసుకుంట్ల గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారని వారితో అనడమే, ఆయన పట్ల సానుకూలతను తెలియజేసింది. గత ఎన్నికల్లో 20వేల తేడాతో ఓడిపోతే దానిని స్వల్ప మెజారిటీ గా పేర్కొనడం కార్యకర్తలకు అర్థం కాలేదు. అప్పటినుంచి ప్రతి సంకేతం కూసుకుంట్లకు అనుకూలంగానే వెలవడుతోంది.
తిరుగుబాటు బావుటా ఎగరేసిన పార్టీ నాయకుల పై పోలీసు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అసమ్మతిగళం వినిపిస్తున్న వారందరికీ భారీగా నగదు నజరానాలు సమర్పించినట్లుగా కూడా పుకార్లు వస్తున్నాయి. గత ఎన్నికల్లో అసంతృప్తితో కూసుకుంట్లకు వ్యతిరేకంగా పనిచేసి సస్పెన్షన్కు గురైన న నాయకుడిని కేసీఆర్ ఇటీవలే చేరదీసి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం కూడా కూసుకుంట్ల కోసమేనని వార్తలు వచ్చాయి.
ఆయనపై ఎందుకింత ప్రేమ..? మునుగోడులో టిఆర్ఎస్- అభ్యర్థికి గతిలేని స్థితిలో ఏమీ లేదు! అక్కడ అభ్యర్థిత్వాన్ని బోలెడు మంది ఆశిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి ఆర్థికంగా బలమైన నేతలు కూడా టికెట్ కోరుకుంటున్నారు. కానీ మొగ్గు మాత్రం కూసుకుంట్లకే ఉంది. ఇవాళ మునుగోడు లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పార్టీ అభ్యర్థి ఎవరినే విషయాన్ని స్పష్టంగా ప్రకటించకపోవచ్చు.. కానీ దానికి సంబంధించిన సంకేతాలను ఇస్తారని అందరూ అనుకుంటున్నారు!
నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే అభ్యర్థిని ప్రకటించాలని టిఆర్ఎస్ ప్లాన్. అయితే స్థానిక నాయకుల మాటలన్నీ పెడచెవిన పెట్టి కూసుకుంట్లకే అవకాశం ఇవ్వాలని అనుకోవడం వెనుక వ్యూహం ఏమిటో అంతుచిక్కేది కాదు!!