Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఏంటి సంగతి?: తెలంగాణపై ఫోకస్ ఏపీపై లేదే!!

ఏంటి సంగతి?: తెలంగాణపై ఫోకస్ ఏపీపై లేదే!!

భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో విజయావకాశాల మీద హోప్స్ పెట్టుకుని ఉన్నదా లేదా? అనేది ఆ పార్టీ అగ్రనాయకులు సాగించే ప్రచారం షెడ్యూలు మీద ఆధారపడి ఉంటుంది.

నిజంగా సీరియస్ గా ఎన్నికల్లో తలపడుతూ.. గెలిచే అవకాశం ఉందని భావించే పక్షంలో ఆ పార్టీ ప్రధాన సారథులు నరేంద్రమోడీ, అమిత్ షా ఖచ్చితంగా ఎన్నికల సభలు ప్లాన్ చేసుకుని వస్తారు. వాళ్లు రాకపోయినా, ఏదో మొహమాటంగా సభలు నిర్వహించినా.. ఆ రాష్ట్రంలో వారికి విజయాలమీద పెద్దగా నమ్మకం గానీ, ధ్యాస గానీ లేదని అర్థం. ఆ సిద్ధాంతం ప్రకారం చూస్తే తెలంగాణ మీద అంతో ఇంతో నమ్మకం పెట్టుకుని పోరాడుతన్న కమలదళం ఏపీలో ఎన్డీయే పొత్తుల పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి సాగిస్తున్న ఎన్నికల సమరాన్ని లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఏపీలో చెప్పుకోడానికి మాత్రమే ఎన్డీయే కూటమి అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. ఓట్ల బదిలీ పద్ధతిగా జరుగుతుందో లేదో తెలియదు. చంద్రబాబు కోవర్టులుగా భాజపాలో ఉన్న వారు మాత్రమే.. సంతోషంగా ఈ పొత్తులతో ముందుకు వెళుతున్నారు. మూడు పార్టీలు సమైక్యంగా ఉన్నాయని చెప్పుకోడానికి, ప్రధాని మోడీ కూడా ఈ మైత్రీబంధానికి విలువ ఇస్తున్నారని చెప్పడానికి అన్నట్టుగా ప్రారంభంలో ఒక ప్రచార సభ నిర్వహించారు. ఆ సభకు మోడీ వచ్చారు గానీ.. ఏదో పైపై మాటలతో తన ప్రసంగాన్ని ముగించారు.

చంద్రబాబు కోరుకున్నట్టుగా జగన్ ను పల్లెత్తు మాట అనలేదు. ఎన్డీయేకు నాలుగువందల సీట్లు ఇవ్వండి అనేది తప్ప ఆయన నోటమ్మట మరో మాట రాలేదు.. కనీసం రాష్ట్రానికి ఒక్క హామీ కూడా ఇవ్వనేలేదు.

తీరా ఎన్నికలు ఇంకో రెండు వారాల దూరానికే వచ్చేస్తుండగా.. అసలు మోడీ పర్యటన మళ్లీ ఏపీలో ఉంటుందా? లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రధాని మోడీ పర్యటనలు సాధారణంగా చాలా రోజులు ముందే ఖరారవుతాయి. తెలంగాణ మీద ఆ పార్టీకి శ్రద్ధ ఉంది కాబట్టి ఇప్పటికే మోడీ మూడురోజులు కేటాయించినట్టు తెలుస్తోంది.

ఈ నెలాఖరులో ఒకరోజున, మే 3,4 తేదీల్లో రెండురోజుల పాటు ఇక్కడ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఆల్రెడీ అమిత్ షా వచ్చి సిద్ధిపేటలో సభ నిర్వహించారు కూడా. కానీ.. ఈమాత్రం ఫోకస్ ఏపీ పై పెట్టడం లేదు. అమిత్ షా సభ అక్కడ షెడ్యూలే కాలేదు.

మోడీ వస్తారో లేదో తెలియదు. చెప్పుకోదగ్గ నేత అంటే రాజ్ నాధ్ సింగ్ మాత్రం విశాఖ వచ్చి వెళ్లారు. ఏపీలో పొత్తు రాజకీయాల మీద అసలు ప్రధాని మోడీకి ఇష్టమే లేదని.. ఆయన ప్రచారానికి ఏపీకి రాకపోవచ్చునని.. బలవంతంగా రప్పించినా కూడా.. జగన్ మీద నిందలు వేయడం జరగకపోవచ్చునని పలువురు అంటున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి, చంద్రబాబు జట్టు గెలిచే అవకాశం లేదనే నమ్మకం కారణంగానే.. ప్రచారానికి వెళితే పరువుపోతుందనే భయంతో మోడీ రావడం లేదని కూడా పలువురు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?