స‌త్యం గెలిస్తే.. శాశ్వ‌తంగా బాబు జైల్లోనే!

చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ టీడీపీ శ్రేణులు “స‌త్య‌మేవ జ‌య‌తే” పేరుతో దీక్ష‌బూనారు. మ‌హాత్మాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని దీక్ష చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. స‌త్య‌మే గెలుస్తుంద‌నే నినాదంతో టీడీపీ దీక్ష చేప‌ట్ట‌డంపై ప్ర‌త్య‌ర్థులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు…

చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ టీడీపీ శ్రేణులు “స‌త్య‌మేవ జ‌య‌తే” పేరుతో దీక్ష‌బూనారు. మ‌హాత్మాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని దీక్ష చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. స‌త్య‌మే గెలుస్తుంద‌నే నినాదంతో టీడీపీ దీక్ష చేప‌ట్ట‌డంపై ప్ర‌త్య‌ర్థులు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి ప్ర‌సంగంలోకి కీల‌క కామెంట్స్‌ని ఎల్లో మీడియా ప్ర‌ధానంగా ప్ర‌చురించ‌డం గ‌మ‌నార్హం. 

భువ‌నేశ్వ‌రి ఏమ‌న్నారంటే.. “నిజం గెల‌వాలి. ఈ నినాదంతో ప్ర‌జ‌లు ముందుకు రావాలి. అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా నేను ప్ర‌జ‌ల‌తో వుంటా, పోరాడ‌తా. ప్ర‌పంచ వ్యాప్తంగా చంద్ర‌బాబు మంచి కోసం చాలా మంది దీక్ష చేస్తున్నారు. మీ అంద‌రి ప్రేమాభిమానం, దేవుడిచ్చిన కొండంత బ‌లంలా మా కుటుంబానికి ర‌క్ష‌ణ‌గా వుంటుంది. అది ఎప్పుడూ మ‌రిచిపోలేను. స‌త్య‌మేవ జ‌య‌తే” అని ఆమె అన్నారు.

త‌న భ‌ర్త‌ను అన్యాయంగా, అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌నేది భువ‌నేశ్వ‌రి ఆవేద‌న‌, ఆరోప‌ణ‌. బాబును జైల్లో వేయ‌డం అంటే స‌త్యాన్ని బంధించ‌డ‌మే అనేది ఎల్లో బ్యాచ్ అభిప్రాయం. అందుకే గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు జైల్లోనూ, వెలుప‌ల ఆయ‌న పార్టీ నాయ‌కులు స‌త్యం గెల‌వాలంటూ దీక్ష చేప‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మ‌నం నాటే విత్త‌నాల‌కు అనుగుణంగా వృక్షాలు వృద్ధి చెందుతాయి. చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థానం యావ‌త్తు అధ‌ర్మంతో సాగింద‌నే ఆరోప‌ణ వుంది. టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో ఆయ‌న పిల్ల‌నిచ్చిన మామ ప‌క్షాన లేరు. టీడీపీకి జ‌నాల్లో ప్ర‌జాద‌ర‌ణ ఉంద‌ని నిర్ధార‌ణ అయిన త‌ర్వాతే ఎన్టీఆర్ పంచ‌న చేరారు. అప్ప‌టికే ఆయ‌న చంద్ర‌గిరిలో టీడీపీ చేతిలో ఓడిపోయారు.

1994లో ఎన్టీఆర్ వృద్ధాప్యాన్ని లెక్క చేయ‌క‌ ఊరూ, వాడా తిరిగి టీడీపీకి ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకున్నారు. అధికార కాంక్ష‌తో ర‌గిలిపోతున్న చంద్ర‌బాబునాయుడు క‌నీసం త‌న‌కు పిల్ల‌నిచ్చిన మామ అని కూడా చూడ‌కుండా, ల‌క్ష్మీపార్వ‌తిని సాకుతూ చూపి ఆయ‌న‌కు వెన్నుపోటు పొడిచారు. వైశ్రాయ్ హోట‌ల్ వ‌ద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు, రాళ్లు వేయించారు. సీఎంగా గ‌ద్దె దింపి, ఆ సీటును తాను ఆక్ర‌మించారు.

చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు అని సుమ‌తీ శ‌త‌కంలో చెప్పిన‌ట్టుగా ఎన్టీఆర్ క‌ష్టార్జితంతో పురుడు పోసుకున్న టీడీపీని చంద్ర‌బాబు లాక్కున్నారు. ధ‌ర్మం అంటే ఇదేనా? అనే ప్ర‌శ్న‌కు స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ సూక్తులు చెబుతున్న భువ‌నేశ్వ‌రి స‌మాధానం చెప్పాలి. త‌న అల్లుడి ప‌దవీ కాంక్ష‌ను ఎన్టీఆర్ క‌ళ్ల‌కు క‌ట్టడాన్ని బ‌హుశా ఆయ‌న కుమార్తె భువ‌నేశ్వ‌రి చూసి వుండ‌క‌పోవ‌చ్చు.

నాదెండ్ల భాస్క‌ర్‌రావు చేస్తే వెన్నుపోటు, అదే ప‌నికి చంద్ర‌బాబు పాల్ప‌డితే మాత్రం టీడీపీని కాపాడుకోవ‌డమ‌ని ఎల్లో మీడియా నీతి సూక్తులు చెబుతుంటుంది. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌ను లాక్కొని, కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్ట‌డం చంద్ర‌బాబు చాణిక్యం. ఇది అన్యాయం, అధ‌ర్మం అని నేడు స‌త్య‌మేవ జ‌య‌తే అని నిన‌దిస్తున్న గొంతులు హిత‌వు చెప్పి వుంటే.. ఇప్పుడు చంద్ర‌బాబుకు ఈ గ‌తి ప‌ట్టి వుండేది కాదు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడ‌వ‌డంలో కుటుంబ స‌భ్యులైన బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుని చంద్రబాబు వాడుకున్నారు. అవ‌స‌రం తీరిన త‌ర్వాత హ‌రికృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర‌రావును విసిరి కొట్టారు. ఇదీ చంద్ర‌బాబు ధ‌ర్మం. 2009 ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రాజ‌కీయంగా వాడుకుని, ఆ త‌ర్వాత లోకేశ్‌కు అడ్డంకిగా త‌యార‌వుతాడ‌ని ప‌క్క‌న పెట్ట‌డం చంద్ర‌బాబు ధ‌ర్మ‌పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని భువ‌నేశ్వ‌రి చెప్ప‌ద‌లుచుకున్నారా?

వ్య‌వస్థ‌ల‌న్నింటిని మేనేజ్ చేసుకుంటూ త‌న‌పై న‌మోదైన కేసుల‌పై విచార‌ణ‌లు లేకుండా, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి స్టేల‌పై కొన‌సాగ‌డం చంద్ర‌బాబు చాణిక్య‌మ‌ని ప్ర‌శంసించిన మీడియా, ఇప్పుడు మూడు వారాలైనా బెయిల్ రాక‌పోవ‌డంతో అదే వ్య‌వ‌స్థ‌ల‌పై బుర‌ద చ‌ల్ల‌డం ధ‌ర్య‌మా? న్యాయ‌మా? అనేది అంత‌రాత్మ‌ను ప్ర‌శ్నించుకోవాలి. చంద్ర‌బాబు రాజ‌కీయ, వ్య‌క్తిగ‌త జీవితంలో చేసిన ఘోరాలు, నేరాల‌కు శిక్ష ఆల‌స్య‌మైంద‌నేది లోకం అభిప్రాయం.

నారా భువ‌నేశ్వ‌రితో పాటు టీడీపీ శ్రేణులు గ్ర‌హించాల్సిన ప్ర‌ధాన విష‌యం ఏమంటే… స‌త్యం అనేదే గెలిస్తే, చంద్ర‌బాబు శాశ్వ‌తంగా జైల్లోనే వుండాల్సి వ‌స్తుంది. కావున అస‌త్య‌మేవ జ‌య‌తే అని ప్రార్థించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అస‌త్యం, అధ‌ర్మ‌మే చంద్ర‌బాబు ర‌క్ష‌క క‌వ‌చాలు. వాటిని కాపాడుకున్నంత కాలం చంద్ర‌బాబు దిగ్విజ‌యంగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతారు. లేదంటే ఆయ‌న ఆవాసం శ్రీ‌కృష్ణుడి జ‌న్మ స్థాన‌మే.