గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకుని మ‌ళ్లీ అరెస్టు చేస్తే?

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు క్వాష్ పిటిష‌న్ విష‌యంలో ఊర‌ట ద‌క్కుతుందా? లేదా! అనే అంశం చ‌ర్చ‌లో కూడా లేకుండా పోయింది. అరెస్టు అయిన మ‌రుస‌టి రోజు నుంచి ఈ…

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడుకు క్వాష్ పిటిష‌న్ విష‌యంలో ఊర‌ట ద‌క్కుతుందా? లేదా! అనే అంశం చ‌ర్చ‌లో కూడా లేకుండా పోయింది. అరెస్టు అయిన మ‌రుస‌టి రోజు నుంచి ఈ పిటిష‌న్ ను ప‌ట్టుకుని చంద్ర‌బాబు లాయ‌ర్లు ర‌క‌ర‌కాల న్యాయ‌స్థానాలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు! ఈ పిటిష‌న్ ను హైకోర్టు అయితే స్ప‌ష్టంగా చెల్ల‌ద‌ని చెప్పింది. కొట్టేసింది. 

సుప్రీంలో ఈ పిటిష‌న్ పై సుదీర్ఘ వాద‌న‌లు, వాయిదాలు కొన‌సాగుతూ ఉన్నాయి! వ‌చ్చే నెల‌లో ఈ పిటిష‌న్ పై సుప్రీం తీర్పు రానుంది. ఈ అంశంపై ఉండ‌వ‌ల్లి అరుణ్ మాట్లాడుతూ.. ఒక‌వేళ 17-ఏ ప్ర‌కారం, చంద్ర‌బాబు అరెస్టుకు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోలేద‌న్న సాంకేతిక కార‌ణాన్ని చూపుతూ.. చంద్ర‌బాబు లాయ‌ర్ల అనుకూల వాద‌న‌కు అనుగుణంగా తీర్పు వ‌చ్చినా, ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకుని వెంట‌నే అరెస్టు చేస్తే ఏం చేస్తారు? అనే ప్ర‌శ్న ఒక‌టి వేశారు!

మ‌రి చంద్ర‌బాబు నాయుడు ఈ కేసు నుంచి ఒక ఇమేజ్ ను ఆశిస్తున్నార‌ని ఇక్క‌డ స్ప‌ష్టం అవుతోంది. అదేమంటే.. ఈ కేసుల‌న్నింటినీ కొట్టేయించుకునే బ‌య‌ట‌కు వ‌స్తార‌ట‌! మ‌రి అలా కేసులు కొట్టేయించుకుని బ‌య‌ట‌కు రావ‌డానికి ఒక సాంకేతిక కారణాన్ని ప‌ట్టుకున్నారు! అదే గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి! అరెస్టుకు ముందు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోలేదు కాబట్టి.. చంద్రబాబు శుద్ధ‌పూస అయిపోవాల‌నమాట‌! ఈ క్వాష్ పిటిష‌న్ ను కోర్టు ఆమోదిస్తే.. త‌ను శుద్ధ పూస గా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టుగా చెప్పుకోవ‌డానికి చంద్ర‌బాబు ఆరాట‌ప‌డుతున్న‌ట్టుగా ఉన్నారు! అయితే క్వాష్ పిటిష‌న్ లో చూపిన సాంకేతిక కార‌ణాల‌కూ, ఈ స్కామ్ కూ ఏ మాత్రం సంబంధం లేదు!

ఎక్క‌డా అవినీతి జ‌ర‌గ‌లేదు, ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాలేదు, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ల పేరిట ప్ర‌జ‌ల‌కు చెవిలో పూలు పెట్టే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు, షెట్ కంపెనీలు సృష్టించ‌బ‌డ‌లేదు, డ‌బ్బులు డైవ‌ర్ట్ కాలేదు.. ఇలాంటి వాద‌న ఏదీ లేదు! కేవ‌లం గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకోలేదు కాబ‌ట్టి.. చంద్ర‌బాబు శుద్ధ‌పూస అని చెప్పుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి జ‌రుగుతూ ఉంది. మ‌రి కింది కోర్టులో అయితే విష‌యంలో నో చెప్పాయి. సుప్రీం కోర్టులో కూడా ఈ విష‌యంపై వాదోప‌వాద‌న‌లు కొన‌సాగాయి. తీర్పు రావ‌డానికి ఇంకా ప‌ది రోజుల‌కు పైనే స‌మ‌యం ఉంది.

మ‌రి సాంకేతిక కార‌ణాన్ని చూపించి చంద్ర‌బాబు నాయుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా.. ఆ మ‌చ్చ అలానే మిగిలిపోతుంది. అయితే చంద్ర‌బాబుకు ఇలాంటి మ‌చ్చ‌లేమీ కొత్త కాదు! చాలా కేసుల్లో ఆయ‌న స్టేలు తెచ్చుకున్నారు. విచార‌ణ‌లు జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని, విచార‌ణ‌ల‌ను ఆపాల‌ని ఆయ‌న న్యాయ‌స్థానాల‌కు వెళ్లి స్టే ల మీదే కాలం వెల్ల‌దీశారు. ఆయ‌న సీబీఎన్ కాద‌ని స్టేబీఎన్ అని కొంత‌మంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఆ ప‌రంప‌ర‌లో చంద్ర‌బాబు నాయుడు అవినీతి వ్య‌వ‌హారాల‌తో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని అయితే వాడుకుంటూ వ‌స్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఆయ‌న నెల రోజుల‌కు పై నుంచినే జైల్లో ఉన్నారు!

మ‌రోవైపు ప్ర‌భుత్వం మ‌రిన్ని పీటీ వారెంట్ల‌తో రెడీగా ఉంది. చంద్ర‌బాబు నాయుడి న‌క్క తెలివితేట‌ల‌తో ఏదోలా త‌ప్పించుకున్నా, మ‌రో వైపు నుంచి బిగించే ప్ర‌య‌త్నం అయితే జ‌రుగుతూ ఉంది. ఇక రాజ‌కీయంగా… చంద్ర‌బాబు నాయుడు ఇలా దీర్ఘ‌కాలం జైల్లో ఉండ‌టం తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌ను నీర‌స ప‌రిచే అంశమే! 1995 నుంచి తెలుగుదేశం అంటే చంద్ర‌బాబే అనే ప‌రిస్థితి కొన‌సాగింది. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో పార్టీ న‌డిచింది. అధికారంలో ఉన్నా, లేక‌పోయినా.. అదే ప‌రిస్థితి కొన‌సాగింది. 

వార‌సుడు ఎప్పుడో వ‌య‌సు ప‌రంగా ఎదిగి వ‌చ్చినా చంద్ర‌బాబు నాయుడుకు ఆస‌రాగా మాత్రం నిల‌వ‌లేక‌పోయాడు. అద‌న‌పు భారంగా కొన‌సాగుతున్నాడు. వార‌సుడిపై చంద్ర‌బాబుకు ఉన్న అతి ప్రేమ‌తోనే తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితిని చంద్ర‌బాబు ఇక్క‌డి వ‌ర‌కూ తీసుకొచ్చాడ‌నే అభిప్రాయాలూ ఉన్నాయి. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు జైల్లో ఉన్న వేళ కూడా లోకేష్ చేస్తున్న అద్భుతాలు ఏమీ లేవు!

ఆయ‌న‌తో కాద‌నే క్లారిటీతో నారా భువ‌నేశ్వ‌రిని కూడా రంగంలోకి దించారు, సానుభూతి ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నారు. ఆమె షో కూడా ఏ మాత్రం ర‌క్తి క‌ట్ట‌డం లేదు. ఏతావాతా చంద్ర‌బాబు ఎన్నాళ్ల పాటు జైల్లో ఉంటే తెలుగుదేశం పార్టీకి అంత స్థాయిలో తీవ్ర‌మైన న‌ష్ట‌మే జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. ఎన్నిక‌ల‌కు మ‌రెన్నో నెల‌ల స‌మ‌యం లేదు మ‌రి!