తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు ఎత్తుల గురించి వేరే చెప్పనక్కర్లేదు! తన అవసరం వచ్చినప్పుడు ఎవరి కాళ్లూగడ్డాలు పట్టుకుని అయినా ఆయన పొత్తుకు ఒప్పించుకుంటారు! అలాంటి వ్యక్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూపంలో ఎలాగూ ఒక దత్తపుత్రుడు దొరికారు! అయినా చంద్రబాబుకు విజయం మీద ధీమా కలిగినట్టుగా లేదు. అందుకోసం బీజేపీతో కూడా పొత్తు ఎత్తులను కొనసాగిస్తూ ఉన్నారు! మరి ఇలా తెలుగుదేశం పార్టీ కనీసం 40 ఎమ్మెల్యే సీట్లను పొత్తులో భాగంగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. జనసేనకు కనీసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, బీజేపీకి 15 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కేటాయించవచ్చు!
మరి కేటాయింపులు అయితే ఇలా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి పోటీ చేయబోయేది మాత్రం మొత్తం చంద్రబాబు మనుషులే అని స్పష్టం అవుతోంది. జనసేన, బీజేపీలకు కేటాయించే ప్రతి సీట్లో పోటీ చేసే వారూ చంద్రబాబు విశ్వాస పరులే తప్ప.. ఆ పార్టీల పట్ల విశ్వాసం ఉన్న వారు కాదని స్పష్టం అవుతోంది. బీజేపీ ద్వారానో, జనసేన ద్వారానో ఎదిగొచ్చిన వారికి ఈ పొత్తుల్లో ఎక్కడా అవకాశం లభించిందని, కేవలం చంద్రబాబు చెప్పిన వారికే ఆ పార్టీలు కూడా టికెట్లను కేటాయించే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఈ పొత్తును చంద్రబాబు నాయుడు కేవలం సాంకేతికం చేస్తున్నారు!
జనసేన, బీజేపీల పేర్లు మాత్రమే ఉంటాయి. అయితే అభ్యర్థులు మాత్రం చంద్రబాబు విశ్వాసం పొందిన వారు మాత్రమే! జనసేన గుర్తు అయినా ఎన్నికల బరిలో ఉంటుందా అనేది ఇంకా ప్రశ్నార్థకమే! ఆఖరి నిమిషంలో జనసేన గుర్తు రిజిస్టర్ కాలేదనుకోంటే.. చంద్రబాబు నాయుడు జనసేన అభ్యర్థులంటూ ప్రకటించి.. వారిని సైకిల్ గుర్తు మీదే పోటీ చేయించే అవకాశం కూడా ఉంది. పోటీ వరకూ వస్తే అభ్యర్థులు తమకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం గురించి చూసుకుంటారు కానీ గుర్తు గురించి పట్టించుకోరు కదా! అప్పుడు జనసేన గుర్తు కన్నా.. సైకిల్ గుర్తు పట్లే అభ్యర్థులు కూడా మొగ్గు చూపవచ్చు. ఇలా చూస్తే జనసేన గుర్తు బ్యాలెట్ మీద ఉంటుందనే నమ్మకాలు ఇంకా లేనట్టే!
ఆ సంగతలా ఉంటే.. బీజేపీ, జనసేనలకు టీడీపీ కేటాయించబోయే సీట్లు.. అక్కడ పోటీ చేసే అభ్యర్థుల గురించి ప్రచారాన్ని, అది కూడా పచ్చమీడియా చేస్తున్న ప్రచారాన్ని చేస్తే అవాక్కవ్వడం పరిశీలకుల వంతు అవుతోంది!
ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేనలకు చెరో సీటు ఇస్తుందట! బలిజల జనాభా గట్టిగా ఉన్న అనంతపురం అర్బన్ ను జనసేనకు, ధర్మవరం సీటును బీజేపీకి ఇస్తారట! మరి అక్కడ అభ్యర్థులు ఎవరంటే.. జనసేన తరఫున జేసీ పవన్ పోటీ చేస్తారట, ధర్మవరం నుంచి వరదాపురం సూరి పోటీ చేస్తారట! జేసీ పవన్ గత ఎన్నికల్లో అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు తెలుగుదేశం తరఫున. ఆయన తండ్రి, పినతండ్రి అంతా తెలుగుదేశం యాక్టివ్ మెంబర్లు, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదా జేసీ అస్మిత్ కు టికెట్ దక్కుతుంది.
ఒకవేళ చంద్రబాబు అదే వ్యూహం ప్రకారమే వెళితే.. పవన్ వెళ్లి జనసేన కండువా కప్పుకుంటారు! పవన్ తండ్రి, పవన్ పినతండ్రి, ఆయన అనుచరగణం అంతా తెలుగుదేశమే! జనసేనకు అనంతపురం అర్బన్ సీటును కేటాయించే పరిస్థితి వస్తే.. అక్కడ నుంచి పోటీకి జేపీ వపన్ కు జనసేన పవన్ తన పార్టీ కండువా వేస్తారు! అలా ఆయన లాంఛనంగా జనసైనికుడు అయిపోవడం, అనంతపురం సీటు నుంచి జనసేన బరిలో నిలవడం జరుగుతుందట!
ఇక ధర్మవరం విషయానికి వస్తే అక్కడ వరదాపురం సూరి అని ఒక కమ్మ నేత ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోగానే ఆయన బీజేపీలోకి చేరిపోయారు! పెద్ద కాంట్రాక్టరు అయిన వరదాపురం సూరి గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో మళ్లీ హడావుడి చేస్తున్నారు. ఆయన చంద్రబాబు ఫొటోలను వాడతారు, పచ్చకండువాలు వాడతారు, పేరుకేమో బీజేపీ! ఇప్పుడు పొత్తులో బీజేపీకి చంద్రబాబు సీటు కేటాయించడం, వరదాపురం అక్కడ అభ్యర్థి అయిపోవడం జరుగుతుందట! మొన్నటి వరకూ వరదాపురం సూరి చంద్రబాబుతో పూర్తి టచ్ లో ఉన్నారని, ఆయన తెలుగుదేశంలో చేరడం ఖాయమని, ఎన్నికల్లో ఆయనకే చంద్రబాబు టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తుకాబట్టి.. ఆయన కమలం పార్టీలో ఉండి పోటీచేస్తారనమాట!
ఇదీ జనసేన, బీజేపీలతో చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న పొత్తు చిత్తు పురాణం! పేరుకు ఆ పార్టీలకు సీట్లను కేటాయించినట్టే కేటాయించి, రాత్రికి రాత్రి కొందరిని చేర్చి, లేదా అప్పటికే చేర్చిన వారికి టికెట్లను ఇచ్చే వ్యూహాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారు! పేరుకు బీజేపీ, జనసేన అభ్యర్థులు కానీ.. అంతా చంద్రబాబు జేబులోని మనుషులే! ఇలా జనసేన, బీజేపీలను చంద్రబాబు చిత్తానికి వాడుకుంటున్నట్టుగా ఉన్నారు!